చక్కెర పరిశ్రమకు మోక్షమెప్పుడో?

జిల్లా అభివృద్ధి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. 2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా, 2019లో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు అమలు ఆశించిన రీతిలో అమలు కావడం లేదు. చెన్నూరులో చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ, కడపలో స్ట్రోమ్‌వాటర్‌ డ్రెయిన్లు, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రధాన హామీలు అమలుకు ఆమడదూరంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ, జిఎన్‌ఎన్‌ఎస్‌ ఫేజ్‌-2 పనుల పునరుద్ధరణ, కొప్పర్తి పైప్‌లైన్‌ పనులు, హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు, ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహం ఏర్పాటు వంటి పనులు ముందుకు సాగడం లేదు. శనివారం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో కథనం… ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా ప్రగతి నత్తనడకన సాగుతోంది. సూపర ్‌స్పెషాలిటీ, కొప్పర్తి పరిశ్రమలు, గోపవరంలో సెంచురీఫ్లైవుడ్‌ పరిశ్రమలు మినహా మిగిలిన హామీలు అమలుకు నోచుకోలేదు. చెన్నూరు చక్కెర పునరుద్ధరణ పనులకు రూ.60 కోట్లను విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది 2007లో కీ.శే మాజీ ముఖ్యమంత్రి అప్పటి వైఎస్‌ సర్కారు తలపెట్టిన రూ.72 కోట్లతో కడపలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ కోల్డ్‌స్టోరేజీకి పరిమితమైంది. ఫలితంగా వర్షాకాలంలో కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునకలు వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కడపలో రూ.70 కోట్ల విలువైన స్ట్రోమ్‌ డ్రెయిన్‌ల ఏర్పాటు హామీ ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రతి ఏటా కురుస్తున్న వర్షాల ధాటికి కడప నగరం మునుగుతోంది. స్ట్రోమ్‌ డ్రెయిన్‌ కాల్వల ఆక్రమణలను తొలగించి విస్తరణ పనులు చేపట్ట డానికి ఇచ్చిన హామీ నిధులు లేక నీరోడుతోంది.అడ్డంకుల్లోనే ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ రూ.345 కోట్లతో కూడిన ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ పనులకు మోక్షం లభించలేదు. సుమారు ఐదేళ్లుగా స్థలం ఎంపిక, శంకుస్థాపన దశలోనే మగ్గుతోంది. ఫలితంగా యూనివర్శిటీ నిర్మాణం ఎప్పటికి సాకా రమవుతుందో తెలియని దుస్థితి దాపురించింది. రూ.12 కోట్లతో కూడిన హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. నిధుల లేమి కారణంగా సకాలంలో పూర్తి చేయడంపై సందేహం నెలకొంది.కొప్పర్తి పైప్‌లైన్‌ మోక్షమెప్పుడోరూ.150 కోట్ల విలువ కలిగిన కొప్పర్తి పారిశ్రామికవాడ నీటి సరఫరా పైప్‌లైన్‌ సాకారానికి నోచుకోవడం లేదు. నీటి కొరత కారణంగా పారిశ్రామిక పురోగతి వెనకడుగు వేస్తుండడం తెలిసిందే. కొప్పర్తిలోని వైఎస్‌ఆర్‌ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు నీటి సదుపాయం అందడం లేదు. ఫలితంగా ఎప్పటికి పూర్తి స్థాయిలో కార్య కలాపాలు సాగిస్తాయో తెలియడం లేదు. కడప, ప్రొద్దుటూరు పాల పరిశ్రమల కార్యకలాపాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. ప్రొద్దుటూరులో మూలన పడిన పాలపరిశ్రమ ఆస్తుల తనఖా పెట్టిన నేపథ్యంలో సుమారు రూ.90 కోట్లు చెల్లింపులకు నోచుకోకపోవడం లేదు. జగనన్న పాలవెల్లువ వంటి పథకంలో భాగంగా పునరుద్ధరణ కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.12 కోట్లతో కూడిన బుగ్గవంక ప్రహరీకి ఇరువైపులా రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా బ్యూటిఫికేషన్‌, లైటింగ్‌ సిస్టమ్‌ ఎప్పుడు ఏర్పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.కదలని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 కోల్డ్‌స్టోరేజీ నుంచి ఎప్పుడు పడతాయో తెలియడం లేదు. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1లో భాగమైన సర్వరాయ సాగర్‌, వామికొండ రిజర్వాయర్లు ఎప్పటికి సాకారమవుతాయో తెలి యడం లేదు. జిల్లా నీటిపారుదల శాఖ రూ.212 కోట్లతో కూడిన ప్రతిపాదనలు పంపించినప్పటికి పాలనాపరమైన అనుమతుల మంజూరు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రూ.82 కోట్లతో కూడిన మైలవరం రిజర్వాయర్‌ ఆధునికీకరణ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.నిరాశలోనే..నిర్వాసితులుఅన్నమయ్య, గండికోట నిర్వాసితుల కన్నీటిధార ఆగడం లేదు. అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణకు రూ.777 కోట్లతో టెండర్లకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల కిందట రిజర్వాయర్‌ గల్లంతైన ఘటన ప్రజల మస్థిస్కాల నుంచి తొలగిపోలేదు. ఆరు గ్రామాల చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఐదు సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోంది. గండికోట నిర్వాసితులకు అదనపు పరిహారం కింద రూ.3.25 లక్షలు ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

➡️