తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు : డిపిఒ

ప్రజాశక్తి – వేంపల్లె వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ముందుగా సిబ్బందితో వారు చేపట్టే విధులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ప్రతి వీధిలో తాగునీరు సరఫరా అయ్యే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలు రోగాల భారిన పడకుండా అయా ప్రాంతాల్లో చెత్తను రోజూ తొలగించాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు. డ్రెయినేజీ కాలువల్లో చెత్తను తొలగించి నీరు రోడ్లపైకి రాకుండా చేయాలని తెలిపారు. ఇంటి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని సిబ్బందిని కోరారు. పన్నుల వసూలు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. విధులు సక్రమంగా చేయక పోతే అలాంటి సిబ్బందిని తొలగిస్తామని హెచ్చరించారు. పంచాయతీకి పేరు వచ్చే విధంగా సిబ్బంది కూడ విధులను నిర్వహించాలని కోరారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2023-24కు సంబంధించి రూ.16 కోట్ల పన్ను బకా యిలుండగా ప్రస్తుతం 4 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. మార్చి ఆఖరు నాటికి వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. పన్నుల వసూళ్లులో అవినీతిని ఆరికట్టేందుకు ఆన్‌ లైన్‌ ద్వారా ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మీదట ఇంటి యా జమానులు గ్రామూపంచాయతీ ఆకౌంట్‌కు చెందిన ఫోన్‌ ఫేలో పన్నులు చెల్లించవచ్చన్నారు. పాడా నిధుల కింద పులివెందుల నియోజక వర్గంలోని మండలాలకు 7090 వీధి లైట్లు మంజూరు అయినట్లు చెప్పారు. మంజూరైన వీధి లైట్లును పంచాయతీల్లోని ఆయా ప్రాంతాల్లో అమర్చుతారన్నారు. సమావేశంలో జమ్మల మడుగు డిఎల్‌పిఒ రమాదేవి, ఇఒపిఆర్‌డి మల్లికార్జునరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ హరి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️