పబ్లిక్‌ సెక్టార్‌ను ధ్వంసం చేస్తున్న బిజెపిని ఓడించండి

Mar 24,2024 00:12 #ch narasingarao, #speech

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు
– విశాఖలో జిఐఇఎ 17వ జనరల్‌ కాన్ఫరెన్స్‌
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశానికి అన్ని విధాలుగా ఆదాయం సమకూరుస్తున్న పబ్లిక్‌ సెక్టార్‌ను ధ్వంసం చేస్తోన్న బిజెపిని, దాని మిత్రపక్షాలను, పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీలను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు కోరారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ వైజాగ్‌ రీజియన్‌ 17వ జనరల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా మార్చివేసి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తోందన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పారని,పది సంవత్సరాలు అయినప్పటికీ ఈ రెండు విషయాల గురించి ప్రధాని ప్రస్తావించడం లేదని విమర్శించారు. రైతాంగాన్నీ మోడీ సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ క్రమంలో కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని కోరారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లను ప్రోత్సహిస్తూ, వారికి అనేక రాయితీలు కల్పిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) ఉపాధ్యక్షులు జి.ఆనంద్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సౌత్‌ జోన్‌ అధ్యక్షులు వై.సుబ్బారావు మాట్లాడుతూ.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌, న్యూ ఇండియా, ఓరియంట్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ వంటి సాధారణ బీమా కంపెనీలను బలోపేతం చేయాలంటే, వాటన్నింటినీ విలీనం చేసి ఎల్‌ఐసి లాగా ఒక కంపెనీగా మార్చాలని అన్నారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు 1971లో జాతీయం కాబడినప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా ఏడు వేలకుపైగా కార్యాలయాలు కలిగి ప్రజలకు తక్కువ రేట్లలో పాలసీలు అందిస్తున్నాయన్నారు. సామాజిక సంక్షేమం ధ్యేయంగా పేదవారికి అనేక పాలసీలను అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని బలోపేతం చేయడం మానేసి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలను ప్రోత్సహించడం సరికాదన్నారు. ప్రయివేట్‌ కంపెనీలు ప్రజలపై భారాలు వేస్తూ ప్రీమియం ఎక్కువగా వసూలు చేస్తాయని తెలిపారు. పై నాలుగు సాధారణ ప్రభుత్వ బీమా రంగ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలాకాలంగా వేతన సవరణ చేయడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సిహెచ్‌.రామకృష్ణ ప్రసాద్‌, కెయువిఎస్‌ఆర్‌.మూర్తి, గణేష్‌ పాల్గన్నారు. పలు జిల్లాల ప్రతినిధులు, పరిశీలకులు పాల్గొన్నారు.

➡️