బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం తగదు : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నగరంలో బుగ్గవంక మీద షామీరియా మసీదు వద్ద బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం తగదని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్‌, నగర కమిటీ సభ్యురాలు ఎస్‌. జమీల పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పాత బస్టాండ్‌లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షామీరియా మసీదు వద్ద బుగ్గవంక మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఆయినా అధికార పార్టీ నేతలు స్పందించాలన్నారు. కొద్ది నెలలుగా బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించామని చేస్తున్న ప్రకటనలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. బడ్జెట్‌లో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్నారు. నగరంలో సర్కిల్‌ విస్తరించటం, కుదించటం మీద ఉన్న శ్రద్ధ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద శ్రద్ద చూపకపోవడం సమంజసం కాదన్నారు. సర్కిల్‌ విస్తరణ ప్రజానీకం అడగకపోయినా చేస్తున్నారని, బుగ్గవంక మీద బ్రిడ్జీలు కావాలని పోరాడుతున్నా స్పందించకపోవడం దుర్మార్గమని వాపోయారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మసీదు బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక ప్రచార అంశంగా చర్చ చేయబోతున్నామని వారు పేర్కొన్నారు. షామీరియా మసీదు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలుపుకుని పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.సమావేశంలో మాట్లాడుతున్న రామమోహన్‌

➡️