మంత్రికి సమస్యల స్వాగతం

Jan 11,2024 21:20

               చిలమత్తూరు : మంత్రి పర్యటన అలా జరగాలి.. సమస్యలేమో ఇలా ఉన్నాయి… కార్యక్రమం ఎలా నిర్వహించాలి.. అంటూ చిలమత్తూరు మండల వైసిపి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైసిపి రాయలసీమ జిల్లాల రీజనల్‌ కోఆర్డీనేటర్‌, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు చిలమత్తూరు మండలంలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి మండల స్థాయి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో అభివద్ధి పనులు జరక్కపోవడంతో మంత్రికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలన్న దానిపై స్థానికులు మల్లగుల్లాలు పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత నాలుగు రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఆయా మండలాల్లో గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే అధికార పార్టీకి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. వివిధ సమస్యలపై ఆయా గ్రామాల్లో మంత్రిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుధవారం నాడు లేపాక్షి మండలంలో రోడ్ల సమస్యపై మంత్రిని అక్కడి ప్రజలు చుట్టముట్టి నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా వైసిపి నాయకులు ఖంగుతున్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకున్న చిలమత్తూరు వైసిపి నాయకులు ముందస్తు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మంత్రి పర్యటించే గ్రామాల్లో ఎలాంటి ప్రశ్నలూ వేయొద్దని గ్రామస్తులను కోరుతున్నారు. గురువారం నాడు పలు గ్రామాల్లో వైసిపి గ్రామ, మండల నాయకులు ఈ రకంగా ఆయా గ్రామాల్లో ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నించే వారు… నిలదీసే వారిని సభలకు తీసుకెళ్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అధ్వానంగా గ్రామీణ రోడ్లు

           చిలమత్తూరు మండల పరిధిలోని దేమకేతేపల్లి పంచాయతీ తమ్మినాయనపల్లి, కోడూరు పంచాయతీలోని మధురేపల్లి, మొరసలపల్లి పంచాయతీలోని ఎస్‌.ముదిరెడ్డిపల్లి, చిలమత్తూరు పంచాయతీలోని చిన్నన్నపల్లి, శెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలకు రోడ్డు సదుపాయం అధ్వానంగా ఉంది. రోడ్డు సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దానిని పరిష్కరించకుండా ఏ పార్టీకి ఓట్లు వేయమంటూ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ్మినాయనపల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో అధికార పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రోడ్డు వేస్తామని వారికి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికల ముగిసిన తరువాత హామీని గాలికి వదిలేశారు. ఈ సమస్యపై ఆ గ్రామస్తులు మంత్రిని ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఈ పంచాయతీలోనే మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని వైసిపి నాయకుల్లోనే అందోళన కన్పిస్తోంది.

పేదలకు అందని ఇళ్ల స్థలాలు..

              చిలమత్తూరు మండలంలో ఇళ్ల పట్టాల కోసం పేదలు నెలల తరబడి పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడి పట్టాల పంపిణీ సమస్య రాష్ట్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. సిపిఎం ఆధ్వర్యంలో పేదలు కోడూరు సర్వే నెంబర్‌ 805లో గుడిసెలు వేసుకుని భూస్వాధీన పోరాటం ప్రారంభించారు. ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు అధికార పార్టీ నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో గుడిసెలను రాత్రికేరాత్రికే తొలగించారు. దీనిపై పేదలు ఆగ్రహించి భూ పోరాట ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా స్థాయిలో కొనసాగించారు. విజయవాడలో సైతం నిరసన తెలిపి అక్కడ ముఖ్య అధికారులకు వినతులు అందజేశారు.

అక్రమ అరెస్టులు..

         చిలమత్తూరులో జరుగుతున్న పోరాటాలకు వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌, ఇతర నాయకులు నాయకత్వం వహించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పర్యటిస్తున్న సందర్భంగా పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆయన్ను నిలదీస్తే వైసిపి నేతల రియల్‌ ఎస్టేట్‌ బాగోతాలు బయటకు వస్తాయని భావించిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి పథకం ప్రకారం వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ను అక్రమ కేసులో అరెస్టు చేయించి, రిమాండ్‌కు తరలించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

పార్టీలోనూ ఐక్యమత్యం కరువు..

           మండల వైసిపిలోనూ గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరాయి. హిందూపురం నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తుండగానే చిలమత్తూరు జడ్పీటీసీ, ఎంపిపి వర్గాలు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సమయంలో అందరూ కలిసి ఉన్నారనే సంకేతాలు ఆ పార్టీ క్యాడర్‌కు ఇచ్చేందుకు అసమ్మతి వర్గంలోని ఒకరికి మండల కన్వీనర్‌ పదవిని ఇచ్చారు. దీనిపై మరో వర్గం తీవ్ర స్థాయిలో అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్వీనర్‌గా మంత్రి ప్రకటించినా అధికారికంగా ఉత్తర్వులు అందని పరిస్థితి ఉంది. మంత్రి పర్యటన ముగిసిన తరువాత కన్వీనర్‌ పోస్టు వచ్చేదే లేదంటూ ప్రత్యర్థి వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. ఓ వైపు సమస్యలు.. మరో వైపు పోరాటాలు.. పార్టీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో మంత్రి సమన్వయం పేరుతో రెండు రోజులు పాటు మంత్రి నిర్వహించే కార్యక్రమాలు ఏ మేరకు జరుగుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.

➡️