మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు

ప్రజాశక్తి-పాడేరు:మన్యంలో మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జోనల్‌ మలేరియా అధికారి ఎం.శాంతి ప్రభ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లో బుధవారం ఆమె సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్త పరీక్షల లేబరేటరీలో రికార్డ్‌ లను పరిశీలించారు. మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదైన కందులపాలెం, చింతాడ, వంట్లమామిడి గ్రామాలలోని కేసులను ఆమె పరిశీలించారు. అదే విధంగా వంట్లమామిడి హెల్త్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌లో రికార్డులు తనిఖీ చేశారు. ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వంట్లమామిడి సచివాలయం ఆరోగ్య సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసు కెళ్లారు. మలేరియా రికార్డులు, ల్యాబ్‌ రిపోర్ట్స్‌, రక్త నమూనాల స్లైడ్స్‌ పరిశీలించారు. అనంతరం జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ భాషను కలిసి తనిఖీలో పరిశీలించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మలేరియా నియంత్రణపై గ్రామాల్లో ప్రజల్ని చైతన్యం చేసేందుకు చేపట్టవలసిన ముందస్తు కార్యక్రమాలను తెలియజేశారు. జిల్లాలో ఎల్‌టిలకు హెల్త్‌ అసిస్టెంట్లకు ట్రైనింగ్‌, ప్రజలకు అవేర్నెస్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరసింహారావు, ఎంపిహెచ్‌ఈఓలు బి.తిరుపతిరావు, బి.ధనుంజరురావు, ఏపీఎంవో డి.శేషాద్రి పాల్గొన్నారు.

➡️