మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 2,2024 10:36 #muncipal workers, #strike

ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని కార్మికులను హెచ్చరించారు. ఒక్కో కుటుంబం నుంచే ఇద్దరు ముగ్గురు కార్మికులుగా పనిచేస్తున్నారని, సమ్మె అయిన తరువాత వారి అంతు తేలుస్తామని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ కార్మికులతో పని చేయించుకుంటామని చెప్పారు. దీంతో సిఐటియు నాయకులు కె.లక్ష్మయ్య మాట్లాడుతూ ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారని, ఇపుడు మాట్లాడటం ఏంటని, పనుల్లో చేర్చుకునేటపుడు లేని అభ్యంతరం ఇపుడు ఎందుకన్నారు. ఒకే కుటుంబంలో ఒకరికి మించి పని చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో తెలియజేయాలన్నారు. చౌకబారు విజ్ఞానంతో కార్మికులను రెచ్చగొట్టరాదని, రోజుకు 1500 ఇచ్చిపోటీ కార్మికులను రంగంలోకి దింపి మభ్యపెట్టి గొడవలకు పురికొల్పవద్దన్నారు. వచ్చే పరిణామాలకు మున్సిపల్‌ కౌన్సిలర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పరిపాలకులుగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి, న్యాయమైన కోర్కెలను పరిష్కరించకుండా వేధింపులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. అధికారులు సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. – గూడూరు టౌన్‌లో సమ్మె ఏడో రోజు యూనియన్‌ రాష్ట్ర నాయకులు గోపీనాథ్‌ మాట్లాడుతూ కరోనా కాలంలో ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ అని అభినందించారని, ఇపుడు నిరవధిక సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. సిఐటియు నాయకులు బివి రమణయ్య, ఎం.సంపూర్ణమ్మ, రాఘవయ్య పాల్గొన్నారు. – నాయుడుపేటలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి గాంధీ మందిరం వరకూ ర్యాలీగా వచ్చి గాంధీ మహాత్మునికి వినతిపత్రం సమర్పించారు. సిఐటియు నాయకులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి నాయుడుపేట మున్సిపల్‌ అధికారులు పోటీ కార్మికులను విధుల్లోకి దించి చెత్తను తొలగించే క్రమంలో కార్మికులపై దాడులు చేయడం తగదన్నారు. నాయుడుపేట మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ జలదంకి కృష్ణారెడ్డి కార్మికులను తొలగిస్తామని చెప్పడం తగదన్నారు. ఒక కార్మికుని తొలగించినా పరిణామాలు వేరేగా ఉంటాయన్నారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు దోచుకుని తింటుంటే కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు.

➡️