మూడొంతుల మందికి పరిహారం లేనట్టే.?

       అనంతపురం ప్రతినిధి : 2023 ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. సీజన్‌ ప్రారంభం నుంచి ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటింంచారు. దీనికి సంబంధించి నష్ట పరిహారం అంచనాలను రూపొందించాలని నవంబర్‌ మాసంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొన్ని షరతులు కూడా పెట్టింది. ఐదు ఎకరాల వరకే పరిహారాన్ని అంచనా వేయాలని, అందులోనూ 33 శాతానికంటే ఎక్కువ నష్టం ఉన్న పంటలనే పరిగణలోకి తీసుకోవాలని ఇలా అనేక షరతులు పెట్టింది. పరిహారం మొత్తాన్ని కూడా చాలా తక్కువగా ప్రకటించిందని విపక్షాలు తప్పుబట్టాయి. అయినా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు అంచనాలను పూర్తి చేశారు. దీని ప్రకారం చూస్తే మూడొంతుల మందికి పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. సాగైంది

6.49 లక్షల ఎకరాలు.. పరిహారం 4.42 లక్షల ఎకరాలకు…

2023 సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాభావమే నెలకొనడంతో సాధారణ సాగులో 69 శాతమే సాగైంది. అంటే ఖరీఫ్‌లో 6.49 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇవి కాకుండా 3.05 లక్షల ఎకరాలు ఉద్యానవన పంటలు సాగయ్యాయి. పంటనష్టపరిహారం అంచనాల్లో ఉద్యానవన పంటలు మినహాయించి సాధారణ పంటలకే పరిహారం లెక్కించారు. దీని ప్రకారం చూస్తే 4.42 లక్షల ఎకరాలకు పరిహారం అందుతుందని అధికారులు అంచనా వేశారు. సాగైన దానిలో 68 శాతం పంట విస్తీర్ణానికి పరిహారం రానుంది. ఇక రైతుల వారీగా చూస్తే ఈ-కెవైసి చేయించుకున్న రైతుల సంఖ్య 2.63 లక్షల ఎకరాలుంది. ఇందులో 1.79 లక్షల మంది రైతులకు పరిహారం అందనుంది. అంటే 64 వాతం మంది రైతులకు మాత్రమే పరిహారం అందనుంది. తక్కిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి రూ.251,20 కోట్లు నష్ట పరిహారానికి ప్రతిపాదనలు పంపించారు.

రైతులందరికీ నష్ట పరిహారమివ్వాలి

చంద్రశేఖర్‌రెడ్డి ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

ఖరీఫ్‌లో వర్షాభావంతో రైతులందరూ పంటలను నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉన్నారు. వారందరికీ పరిహారం అందివ్వాలి. అదికూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పరిహారం ఇవ్వాలని తాము ముందు నుంచే కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రైతుకు అందే సహాయం నామమాత్రమే. వేరుశనగ సాగుకు ఎకానికి రూ.40 వేల వరకు ఖర్చ వస్తోంది. కాని ప్రభుత్వమిస్తున్న సహాయం రూ.7000 కూడా ఎకరానికి ఉండటం లేదు. అందుకే రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్‌ చేస్తున్నాం. అది కూడా రైతులందరికీ పరిహారమివ్వాలి.

➡️