శ్రీకాంత్‌ పరాజయం

Mar 24,2024 23:42 #Sports

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
బసెల్‌ (స్విట్జర్లాండ్‌) : భారత సీనియర్‌ షట్లర్‌, ప్రపంచ మాజీ నం.1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ పోరాటానికి తెరపడింది. సుమారు 16 నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఓ బిడబ్ల్యూఎఫ్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తెలుగు తేజం.. ఫైనల్‌ ముంగిట తడబడ్డాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో చైనీస్‌ తైపీ షట్లర్‌ లిన్‌ చున్‌ చేతిలో 21-15, 9-21, 18-21తో పరాజయం పాలయ్యాడు. స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గంటకు పైగా సాగిన సెమీఫైనల్‌ పోరులో కిదాంబి శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో ఆకట్టుకున్నాడు. 1-0తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ తేలిపోయాడు. కనీస పోటీ ఇవ్వకుండా నిరాశపరిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 16-15తో శ్రీకాంత్‌ ముందంజ వేసినా.. ఆ తర్వాత లయ తప్పాడు. 16-16తో స్కోరు సమం చేసిన చైనీస్‌ తైపీ షట్లర్‌ వరుస పాయింట్లతో 19-16తో ఆధిక్యం సాధించాడు. శ్రీకాంత్‌ పాయింట్ల వేట కొనసాగించినా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌, మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, గాయత్రి పుల్లెల ఇప్పటికే ఓటమి పాలవగా స్విస్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల టైటిల్‌ వేటకు తెరపడింది.

➡️