సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

పాడేరులో సమావేశంలో మాట్లాడుతున్న సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-పాడేరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక వర్గానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. ఆదివారం పాడేరులో నిర్వహించిన అల్లూరి జిల్లా సిఐటియు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలను ప్రధాని మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ స్వలాభం కోసం మోడీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలని చూస్తుందన్నారు.వివిధ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు అతి తక్కువ వేతనాలతో శ్రమను దోచుకుంటుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని, వారి మద్దతుదారులను చిత్తుగా ఓడించాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన మూడు పార్టీలు కేంద్రంలో బిజెపితో జట్టు కడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి అన్యాయం చేసినా అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజెపికి కొమ్ముకాస్తున్నాయన్నారు. జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని,గిరిజన ప్రాంతంలో స్పెషల్‌ డిఎస్సిని విడుదల చేసి, అటవీ చట్టాల్ని పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమానికి పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు శంకర్రావు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.అప్పల నరస, అనంతగిరి జడ్పిటిసి సభ్యులు డి. గంగరాజు, సిఐటియు ఆఫీస్‌ బేరర్స్‌, సన్నీ బాబు, భగత్‌ రాం, శంకర్రావు, నాయుడు, పోతురాజు, సుందర్‌ రావు, వివిధ రంగాల కార్మికులు, నాయకులు పాల్గొన్నారుగంగరాజు విస్తృత ప్రచారం అనంతగిరి:సార్వత్రిక ఎన్నికలలో సిపిఎం బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థాని సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు కోరారు. ఆదివారం ఎగువ శోభ పంచాయతీ పరిధి దిగువశోభ, పూర్ణపుదోర్‌, ఎగువ శోభ, సరసుపదర్‌. టోకూరు పంచాయతీ బ్రిడ్జి వలస తదితర గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, తాగునీరు, .డ్రెయినేజీ, సిసి రోడ్డు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే నాయకులను గెలిపిస్తే అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రజల గళం విప్పుతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల యూత్‌ నేత శాంతారావు, వార్డు మెంబర్‌ పి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️