స్పందనకు 167 వినతులు

Feb 19,2024 21:28

ప్రజాశక్తి – పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 167 వినతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అర్జీదారుల నుంచి వచ్చే దరఖాస్తులపై సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి, వివరాలు తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు, సూచనలు చేశారు. ఇన్‌ఛార్జి జాయింటు కలెక్టరు సి.విష్ణుచరణ్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, ఆర్‌డిఒ కె.హేమలత ప్రజల నుండి వినతులు స్వీకరించారు. స్వీకరించిన వినతుల్లో కొన్ని….బలిజిపేట మండలం నారన్నయుడువలసలో ఎస్సీ కాలనీ వాసులకు ప్రభుత్వం వారు కొంత భూమిని నివాస స్థలాల కోసం ఇచ్చి ఉన్నారని, ఆ నివాస స్థలాలన్ని వేరేవారు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వి. రామప్పడు దరఖాస్తు అందజేశాడు.కొమరాడ మండలం మార్కండపుట్టికి అదనంగా ఒక అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్‌ జె.ఇందిరమ్మ, గ్రామస్తులు కోరారు. సాలూరు మండలం దండిగాంలో 20 కుటుంబాలు నివాసముంటున్నామని, సర్వేనెంబర్‌ 1లో సుమారు 20 ఎకరాల భూమి ఫారెస్ట్‌ భూముల్లో కలిసిపోయిందని, ఆ భూమిని తిరిగి తమ రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చి తమకు సాగు చేసేందుకు అవకాశం కల్పించాలని పి.చిరంజీవి, ఇతరులు వినతి పత్రం సమర్పించారు. బలిజిపేట మండలం వెంగాపురానికి చెందిన కె.దేవిచరణ్‌ సర్వే నంబర్‌ 66-16, పలగర రెవెన్యూలోని మెట్టు 0.95 సెంట్లు భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైందని అర్జీ అందజేశారు. బలిజిపేట మండలం చాకరాపల్లి గ్రామానికి చెందిన మజ్జి సింహాద్రి నాయుడు బోరు బావికి కరెంట్‌ లైన్‌ ఇప్పించాలని కోరారు. గరుగుబిల్లి మండలం బొత్సవలసకు చెందిన టి.జగన్నాధ రావు సర్వేనెంబర్‌ 36-20లో 26 సెంట్లు భూమికి 1బి మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలం శంబరకు చెందిన వి.పోలినాయుడు వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. వీరఘట్టం మండలం నడుకూరుకు చెందిన బి.సీతాలక్ష్మి హౌస్‌ ఓల్డ్‌ మ్యాపింగ్‌లో వేరు చేసి వితంతు పెన్షన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి బి.జగన్నాధరావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర రావు, డిఇఒ పగడాలమ్మ, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్‌.కష్ణ, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.సీతంపేట ఐటిడిఎలో… సీతంపేట : తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు గిరిజనులు విన్నవించారు. స్పందన కార్యక్రమం ఎపిఒ రోసిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐటిడిఎలో నిర్వహించారు. గాదిలంక చెందిన జీవన్‌ కుమార్‌ సిసి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. గుర్రాలమెట్టకు చెందిన రాజారావు సిఆర్‌టి పోస్ట్‌ ఇప్పించాలని విన్నవించారు. పెద్దరాజపురానికి చెందిన మహేష్‌ రైస్‌ మిల్‌ మంజూరు చేయాలని కోరారు. గేదెలగూడకు చెందిన చిన్నారావు కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని కోరారు. కేరాసింగి గూడకు చెందిన సోమయ్య తాగునీరు సమస్య పరిష్కరిం చాలని కోరారు. జామితోట చెందిన రమణమ్మ వితంతు, పెన్షన్‌ మంజూరు చేయాలని విన్నవించారు. పింగువాడకు చెందిన సూరయ్య వరిపంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్పందన కార్యక్రమం లో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎస్‌.సింహాచలం, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయపార్వతి, పిఎఒ హరికృష్ణ, పిహెచ్‌ఒ గణేష్‌, సిడిపిఒ రంగలక్ష్మి, డిఇ కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️