3 నుంచి త్యాగరాజ ఆరాధనోత్సవాలు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

జనవరి 3 నుంచి 8వ తేదీ వరకూ శ్రీ త్యాగరాజ మ్యూజిక్‌ అకాడమీ (త్యాగరాజ భక్త సభ) ఆధ్వర్యంలో 105వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు, త్యాగరాజ వర్థంతిని నిర్వహిస్తున్నట్లు మ్యూజిక్‌ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కారుమూరి ఆదిత్య తెలిపారు. సోమవారం జరిగిన సమావేశంలో బ్రోచర్‌ను విడుదల చేసి మాట్లాడారు. జనవరి 3 నుంచి 6వ తేదీ వరకూ సాయంత్రం 6.30 గంటల నుంచి ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, 7, 8 తేదీల్లో ఎఎస్‌ఆర్‌లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో 105వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్‌, సభ్యులు చెరుకువాడ వెంకట్రామయ్య, రంగసాయి మాట్లాడుతూ 3న ఉదయం 8.30 గంటలకు స్వామివారి ఊరేగింపు, సాయంత్రం 6.30 నిమిషాలకు సురేంద్రనాథ్‌ అండ్‌ పార్టీ 24 మంది బృందంతో నృత్యం, 4న యోగావందనచే వీణ కచేరి, 5న లతాంగి సిస్టర్స్‌చే గాత్రం, 6న ఉదయం 10 గంటలకు శ్రీత్యాగరాజ స్వామివారి పంచరత్న కీర్తనలు, సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరు బ్రదర్స్‌ వారిచే గాత్రం, 7న జంధ్యాల కష్ణకుమారి బందంచే హరికథ జరగనుందని తెలిపారు. 8న పోపూరి గౌరీనాధ్‌ బృందం వారిచే పాహిరామ ప్రభో సంగీత రూపకం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ పాల్గొని ఆరాధనోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కారుమూరి బాబు పాల్గొన్నారు.

➡️