8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట ..

న్యూఢిల్లీ :   భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట కలిగింది. వారి మరణశిక్షను ఖతార్‌ కోర్టు రద్దు చేసినట్లు భారతవిదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గూఢచర్యం ఆరోపణలపై వారికి ఖతార్‌లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను తగ్గించి జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. అయితే వారికి ఎన్ని సంవత్సరాలు శిక్ష విధించారన్న దానిపై స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ  సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

అరెస్టయిన వారిలో కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, అమిత్‌ నాగ్‌పాల్‌ మరియు సంజీవ్‌ గుప్తా, కెప్టెన్‌లు నవతేజ్‌ సింగ్‌ గిల్‌, బీరేంద్ర కుమార్‌ వర్మ, సౌరభ్‌ వశిష్ట, నావికుడు రాకేష్‌ గోపకుమార్‌లు ఉన్నారు. వీరు భారత సైన్యంలో  హై ర్యాంక్ అధికారులుగా సేవలందించారు.  యుద్ధనౌకలను కూడా నడిపారు. ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ మరియు సంబంధిత సేవలను అందించే ప్రైవేట్‌ సంస్థకోసం పనిచేస్తున్నారు.

➡️