కూచ్‌ బిహార్‌లో వేర్పాటువాదులతో బిజెపి దోస్తీ

Apr 18,2024 03:50 #2024 elections, #BJP
  • కేంద్ర హోం సహాయ మంత్రి ప్రామాణిక్‌ కోసం మోడీ ప్రచారం
  •  పోటీలో ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి
  •  కాంగ్రెస్‌, టిఎంసి క్యాండేట్లు కూడా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌… బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ల రాజకీయ ద్రోహానికి బలైంది. ఉత్తర బెంగాల్‌లోని అస్సాంకు ఆనుకుని ఉన్న ఈ వ్యవసాయ ప్రాధాన్యత ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధిలో స్తబ్దతను ఎదుర్కొంటోంది. టిఎంసి నుంచి బిజెపిలో చేరి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన నిషిత్‌ ప్రమాణిక్‌ ప్రస్తుతం కూచ్‌ బెహార్‌ ఎంపిగా ఉన్నారు. కూచ్‌ బెహార్‌ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న వేర్పాటువాదులతో పొత్తుపెట్టుకుని బిజెపి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందింది. కూచ్‌ బెహార్‌ జిల్లాలో 52 శాతం మంది షెడ్యూల్డ్‌ కులాల వారున్నారు. వీరిలో 42 శాతం ఉన్న రాజవంశీ వర్గానికి నేతగా ఉన్న అనంత్‌ మహరాజ్‌ను బిజెపి రాజ్యసభ సభ్యునిగా చేసింది. ‘నారాయణ’ అనే ప్రత్యేక ఆర్మీ బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో బిజెపి తన ప్రభావాన్ని చాటుకుంది. అనంత్‌ మహరాజ్‌ రాజ్యసభ సభ్యునిగా కూర్చోవడం మినహా ఆ వర్గానికి బెటాలియన్‌తో సహా ఏమీ రాలేదు.

సిటిజన్‌షిప్‌ ఇబ్బందులు
పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన మౌత్వ సమాజం కూడా ఆందోళన చెందింది. సిపిఎం కూచ్‌ బెహార్‌ జిల్లా కార్యదర్శి అనంతరారు మాట్లాడుతూ.. తమ దరఖాస్తులు సంక్లిష్టమైన ప్రక్రియల్లో చిక్కుకు పోతున్నాయన్నారు. అధికారులు అడిగే పత్రాలను చూపించలేకపోతున్నామని తెలిపారు. ‘ఎన్‌ఆర్‌సి అమలులోకి వచ్చినప్పుడు, అస్సాంలో లక్షలాది మంది జాబితా నుండి దూరంగా ఉన్నారు. ఇది వారిని ఆందోళనకు గురిచేసింది.

లెఫ్ట్‌ సర్కారులో అభివృద్ధే…
లెఫ్ట్‌ఫ్రంట్‌ సర్కారు హయాంలో కూచ్‌ బెహార్‌లో విద్యా రంగం, వ్యవసాయం, అటవీ సంరక్షణలో గణనీయమైన పురోగతి చెందింది. జూట్‌ ఇండిస్టియల్‌ పార్క్‌ కూడా స్థాపించబడింది. 2011లో రాష్ట్రంలో టిఎంసి ప్రభుత్వం వచ్చిన తరువాత, 2019లో బిజెపి ఎంపి గెలిచిన తరువాత అభివృద్ధి అని చెప్పుకునేదేమీ జరగలేదు. తణమూల్‌ గ్యాంగ్‌స్టర్లకు నాయకత్వం వహించిన ప్రామాణిక్‌ను బిజెపి కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిని చేసింది. ఇక్కడ అవినీతి, దోపిడీ మాత్రమే జరుగుతోంది. టిఎంసి, బిజెపిలను ఓడించేందుకు లెఫ్ట్‌ ఫ్రంట్‌ పోరాడుతోంది’ అని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనంతరారు చెప్పారు. లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన నితీష్‌ చంద్రరారు ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ తడవ కూడా అభ్యర్థి ప్రామాణిక్‌కు ఓట్లు అడిగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. 19న తొలి దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర ప్రధాన అభ్యర్థులు జగదీష్‌ బసునియా (టిఎంసి), ప్రియా రే చౌదరి (కాంగ్రెస్‌) ఉన్నారు.

➡️