గ్రూప్‌-1 అక్రమాలపై సిబిఐ విచారణ

  •  టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలైందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని, వాటికి కారణాలు ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. తమ వారిని పోస్టింగుల్లో కూర్చోబెట్టుకునేందుకు పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడి సర్వీస్‌ కమిషన్‌ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశారని పేర్కొన్నారు. అక్రమాల వెనుక ఉన్న కమిషన్‌ పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌, మాజీ కార్యదర్శి, ఐపిఎస్‌ అధికారి సీతారామాంజనేయులును తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి, లక్షల మంది నిరుద్యోగుల నోట్లో సిఎం వైఎస్‌ జగన్‌ మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు జాబ్‌ కేలండరు రాక, ఇటు ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో యువత ఉందని తెలిపారు.

➡️