గాజాలో చిన్నారుల ఆకలి కేకలు

Mar 10,2024 09:35 #Children, #cries, #Gaza, #Hunger

రాఫా : ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో చిన్నారులు కేవలం బాంబుల వల్లనే కాకుండా, తీవ్రమైన ఆకలి బాధలతో అల్లాడుతూ చనిపోతున్నారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యవసరంగా అందాల్సిన ఆహార సరఫరాలను కూడా కట్టడి చేయడంతో గాజాప్రాంతం దుర్భిక్షంగా మారుతోందని ఇప్పటికి నెలల తరబడి అధికారులు హెచ్చరిస్తూనే వున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు. ఉత్తర గాజాలో ఆకలి సమస్య అతి దారుణంగా వుంది. కమల్‌ అద్వాన్‌, షిఫా ఆస్పత్రుల్లో పోషకాహార లోపంతో 20 మంది మరణించారని వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణ గాజాలో కూడా ఇప్పటికే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, ఈ ఆకలి బాధ తట్టుకోలేక కన్ను మూస్తున్నారు. రాఫాలోని ఎమిరటి ఆస్పత్రిలో ఇంకా నెలలు నిండని 16 మంది నవజాత శిశువులు గత ఐదు వారాల్లో మృత్యువాత పడ్డారని డాక్టర్లు తెలిపారు. గాజాలో చిన్నారుల మరణాలే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యునిసెఫ్‌ మధ్య ప్రాచ్యం చీఫ్‌ అడెలె ఖోదర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ బాంబు దాడులు, పదాతి దాడులు ఇప్పటికి 30 వేలకు పైగా ప్రాణాలను బలిగొన్నాయని, వాటిలో మూడు వంతుల మంది మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం లేకపోవడంతో గాజాలో డయేరియా కూడా చాలా ప్రబలంగా వుంది. అంటు వ్యాధుల సమస్య కూడా పొంచి వుందని యునిసెఫ్‌ నిపుణుడు హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి చర్యల వల్లనే ఈ సమస్య ముదురుతోందని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయిల్‌ అతిగా విధించిన ఆంక్షలు, తనిఖీలతో ఆహార కాన్వారులు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయని పాలస్తీనా తెలిపింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఇజ్రాయిల్‌ ఈ వారంలో నేరుగా ఆహార సాయమందడానికి వీలుగా మరిన్ని సరిహద్దులను తెరవనున్నట్లు తెలిపింది.

                                                                         ఆహార ప్యాకెట్లు మీద పడి ఐదుగురి మృతి

గాజాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు సహాయక సంస్థలు పంపిన పారాచూట్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్‌డ్రాప్‌ తెరవడంలో సమస్య ఏర్పడి, పారాచూట్‌లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆహారం ప్యాకెట్లు ఆకాశం నుంచి పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీనిని గాజా ప్రభుత్వ మీడియా ధవీకరించింది. గాయపడిన వారిని ఆల్‌-షిఫా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పాలస్తీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌డ్రాప్‌ ఆకలి సమస్యకు పరిష్కారం కాదని.. ఇది పనికిరాని చర్య అంటూ మండిపడింది. ఎయిర్‌డ్రాప్‌ ప్రమాదానికి దారి తీస్తుందని తెలిపింది.

➡️