మామా అల్లుళ్లపై ఇసికి ఫిర్యాదు

ఆమదాలవలస వైసిపి, టిడిపి అభ్యర్థులు... మామా

సమావేశంలో మాట్లాడుతున్న సువ్వారి గాంధీ

  • ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం
  • న్యాయ పోరాటం కూడా చేస్తా
  • స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ

ప్రజాశక్తి – ఆమదాలవలస

ఆమదాలవలస వైసిపి, టిడిపి అభ్యర్థులు… మామా అల్లుళ్లు తమ్మినేని సీతారాం, కూన రవికుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ తెలిపారు. వారిద్దరూ ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ స్పీకర్‌గా ఉన్న సీతారాం తన నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు జత చేశారని ఆరోపించారు. గత, ప్రస్తుత ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తన విద్యార్హతపై స్పష్టత లేని వివరాలు పొందుపరిచారని చెప్పారు. ప్రస్తుత నామినేషన్‌ పత్రాల్లో ఆస్తుల వివరాలూ సక్రమంగా ఇవ్వలేదని చెప్పారు. ఆయన సతీమణి వాణిశ్రీ, తనయుడు చిరంజీవి నాగ్‌ డైరెక్టర్లుగా సుశ్రుత సంహిత సర్జికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాణిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరో రెండు కంపెనీలను అఫిడవిట్‌లో పొందుపరచలేదని తెలిపారు. టిడిపి అభ్యర్థి కూన రవికుమార్‌ గత ఎన్నికల్లో రూ.రెండు కోట్ల ఆస్తులు చూపి, ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్‌లో రూ.ఏడు కోట్లు చూపించారని చెప్పారు. అతని విద్యార్హత బిఇ సివిల్‌పైనా అనుమానాలు ఉన్నాయని, త్వరలోనే వాటి నిజానిజాలను నిగ్గు తేలుస్తామన్నారు. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలతో జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. వారిద్దరి కుటుంబ ఆస్తుల వివరాలు, విద్యార్హతలపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. మామా అల్లుళ్లు ఒకరు అధికారంలో ఉంటే మరొకరికి సహకరించుకుంటూ వారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. 2015-19 మధ్య కాలంలో రవికుమార్‌ విప్‌గా ఉన్న సమయంలో తమ్మినేని సీతారాం డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయని తెలిపారు. ఇద్దరు డైరెక్టర్లతో కంపెనీలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికలకు రెండు నెలల ముందు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ఎన్నికల పూర్తయిన తర్వాత తెరచాటు ఒప్పందాలు చేసుకొని ఇద్దరూ లాభపడుతూ, ప్రజలకు పంగనామాలు పెడుతున్నారన్నారు. వీరిద్దరి అసలు స్వరూపం ప్రజల ముందు బయటపెడతానని చెప్పారు. ఈ రెండు కుటుంబాల అక్రమార్జనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

➡️