పల్నాడులో డిష్యుం..డిష్యుం…

May 13,2024 15:41 #palnadu

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు
తెనాలి వైసిపి అభ్యర్థి అన్నాబత్తినపై ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం
పల్నాడుజిల్లాలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీ అభ్యర్థి, మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగినట్లుగా సమాచారం. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం నాయకుడు కేశవరెడ్డి నివాసంలో ఉన్న ఆ పార్టీ నాయకులుపై వైసిపి వారు వచ్చి మూకుమ్మడి దాడులు చేశారు. మరికొందరు పారిపోతుండగా కారులో వెంబడించారు. ఈ దాడుల్లో పదిమంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో మాచర్ల ఎమ్మెల్యే పిఆఆర్‌కె వాహనాన్ని టిడిపి వారు ధ్వంసం చేశారు. పల్నాడుజిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్‌ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ కారు పై టిడిపికి చెందిన వారు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనను మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఓడిపోతామని నిరాశతో టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. తుళ్ళూరు మండలం పెదపరిమిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నేత సందీప్‌,, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు ఈ ఘటనలో గాయాలపాలయ్యాయి. గుంటూరు కొరిటపాడులో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పితో మంత్రి విడుదల రజనీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు.

➡️