అంతిమ తీర్పు

Jan 22,2024 10:16

శ్రామిక దోపిడీ సహించబోమంటూ

వేలాది కార్మిక పాదాలు

హక్కుల పోరాటాలై కదిలాయి.

ఆకలి ఆకలి అంటూ

పొట్ట చేత పట్టుకుని

లక్షలాది శ్రామిక హస్తాలు

ఉక్కు పిడికిళ్ళై లేచాయి

గృహ నిర్బంధాలంటూ..

ఎస్మా హెచ్చరింపులతో

ఉక్కు సంకెళ్లు మోగుతున్నాయి !

పాదయాత్రలోని ఓట్ల ప్రేమ

పాలనలో పగగా మారిందా?

మాట తప్పి మడమ తిప్పిందా?

హక్కులపై ఉక్కు పాదం

అక్క చెల్లెళ్లపై ఉగ్రరూపం

సుప్రీంకోర్టు తీర్పుల్నే ధిక్కరించి

గర్భిణీలను, బాలింతలను,

చిన్నారులను, వితంతువులను,

వృద్ధ మహిళలను రోడ్డుకీడ్చిన విగ్రహ

స్వరూపం!

అమ్మను, చెల్లిని ప్రేమించలేని వారు

శ్రమశక్తిని ఏమి గౌరవించగలరు ?

కానరావే..!?

శ్రమజీవుల బాధలు – జీవన గాధలు

కళ్ళుండీ చూడలేని గుడ్డి పాలన

చెవులుండీ వినలేని చెవిటి పాలన

చేతులుండీ చేయలేని కుంటి పాలన

అంగన్వాడీ బతుకులు

పని బారెడు – జీతం మూరెడు

జీవితమంతా చిరుగుల అతుకులు

చులకనగా, అగౌరవంగా, దొంగలుగా

గుర్తింపులు

ప్రభుత్వ మీటింగులకు

పోటెత్తే జన ప్రవాహం వాళ్లే.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు

అనర్హులూ వాళ్లే ..!?

అధికారుల బెదిరింపులకు,

వేధింపులకు, హత్యలకు

ఆత్మహత్యలుగా వాళ్లే!

నిత్యవసర ధరలు పెరిగి

కుదేలవుతున్న జీవితాలు వాళ్లే!

సామాజిక అవసరాలకు

చాలీచాలని జీతాలుగా వాళ్లే!

మాట్లాడటం నేరం

ప్రశ్నించటం ద్రోహం

పనికి తగ్గ కనీస గౌరవ వేతనం,

గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌,

పెన్షన్‌ ఈ జీవన భద్రతను కోరడం

ద్రోహం!

వాళ్ల న్యాయమైన హక్కుల కోసం

సమ్మె చేయటం రాజ ద్రోహం !

ఈ కళ్ళే.. గుర్రాలతో తొక్కించిన

రాజ్యాలను మట్టి కల్పించాయి

ఇప్పుడు ఈ కాళ్ళే.. మీ ఎస్మా చట్టాలపై

పోరు బాట పట్టాయి

ఊపిరి పోయినా ఉద్యమం ఆగదు.

సామాన్యుల నోళ్లు కొడితే

కూలేది రాజ్యాలే !

ఎస్మా ప్రయోగీ.. అప్రజాస్వామ్య ఉన్మాదీ..

తస్మాత్‌ జాగ్రత్త !

వాళ్ళ ఉసురు తగిలి

ప్రభుత్వాల కోట గోడలు కూలేదే

అంతిమ తీర్పు!           – శిఖా – ఆకాష్‌9381522247.

➡️