పాలేటి… వ్యూహం ఏంటి..?

Jan 13,2024 01:01

– రానున్న ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు
– మారుతున్న పరిణామాలపై సమాలోచనలు
– 17న అనుచర వర్గంతో రాజకీయ సభకు ఏర్పాట్లు
ప్రజాశక్తి – చీరాల
నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. నిత్యం ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక కార్యక్రమాలతో ప్రజలను తన వైపు ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేటి వ్యూహం ఏంటనే ఆలోచనతో సందిగ్ధంలో ఉన్నారు. ఈనెల 22న అధికార వైసిపి సామాజిక సాధికార యాత్ర పేరుతో క్యాడర్‌ను ఎన్నికలకు సిద్దం చేసే పనిలో పడింది. ప్రతిపక్ష టిడిపి ‘రా… కదిలి రా…’ నినాదంతో ఈనెల 29న బాపట్ల పార్లమెంటు స్థాయి సభ చీరాలలోనే ఏర్పాటు చేస్తుంది. రెండు ప్రధాన పార్టీల కార్యాచరణ మొదలైంది. దీంతో గత 20ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ క్రియాశీల రాజకీయాలు చేస్తున్న డాక్టర్‌ పాలేటి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలపై తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈపాటికే తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఏ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉండబోతున్నారనేది స్పష్టత లేదు. తన రాజకీయ ప్రయాణంలో మొదటి నుండి ప్రశ్నించే ధోరణితో నడిచిన ఆయన అవకాశాలను కోల్పోయారు. గత మూడు దఫాలుగా పోటీకి దూరంగా ఉన్నారు. తాను తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల్లో ఒకప్పుడు సామాజిక పొందిక ప్రధానమైదైతే ఇప్పడు ఆర్ధిక వనరులే ఎన్నికలకు ప్రధాన అంశంగా మారిపోయింది. ప్రభుత్వాలను సైతం మెడలు వంచగలిగే చైతన్య వంతమైన దళిత సామాజికవర్గం నియోజకవర్గ రాజకీయాల్లో బలహీనపడటంతో వెనుక బడిన వర్గాల నుండి మాట్లాడే వాళ్లకు ఆధారం లేకుండా పోయినట్లైంది. వెనుక బడిన వర్గాల నుండి పోటీలోకి వచ్చే సాహసం కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన నాలుగు దఫాలుగా నియోజకవర్గ రాజకీయాలు ఉన్నత వర్గాల చేతుల్లోకి వెళ్లాయి. ఎన్నికల్లో పెరిగిన డబ్బు ప్రభావానికి తోడు సామాజిక పెత్తనం బలహీనవర్గాలకు అవకాశాలను దూరం చేసిందనే విమర్శ ఉంది. తామున్నామని బయటికి వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ రాజకీయాలు మళ్లీ బలహీనవర్గాల చేతికి రావాలి. అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలి. ప్రశ్నించే వాళ్లకు ఊతం ఇవ్వాలి. అందుకే తన రాజకీయ ప్రయాణంలో దళితులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తను అనుచరులతో ఆలోచనలు చేశారు. అంతే కాకుండా ఆచరణలోనూ వాళ్లనే ముందు పీఠిన నిలిపుతున్నారు. తాను శాసన సభ్యునిగా ఉన్న రోజుల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవికి డేటా జోసఫ్‌ను నామినేట్‌ చేశారు. అప్పటి నుండి ఆ పదవిని దళితులకు ఇచ్చే సాంప్రదాయానికి పునాది వేశారు. ఇప్పుడు అలాంటి తరహాలో మరో ప్రయత్నానికి సిద్దమయ్యారు. ఎన్నికలు సమీపించే కొద్ది అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో తన రాజకీయ భవితవ్యంపై స్పష్టత ఇచ్చేందుకు తన అనుచరులతో చేస్తున్న సమాలోచనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారైతే మరింత స్పష్టత వచ్చే అవకాశాం ఉంది.

➡️