నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్‌ చీవాట్లు

Dec 14,2023 09:46 #America, #Israel, #Joe Biden
biden on israel president

ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం వుందని వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తన కరడుగట్టిన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా బైడెన్‌ పరోక్షంగా నెతన్యాహకు చివాట్లు పెడుతూ, భవిష్యత్తులో పాలస్తీనా దేశానికి ఇజ్రాయిల్‌ నో చెప్పరాదని అన్నారు. విరాళాల సేకరణ కార్యక్రమం సందర్భంగా బైడెన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే గాజాపై ఇజ్రాయిల్‌ నిరంతరంగా సాగిస్తున్న దాడుల పట్ల అమెరికా ఆందోళన పెరుగుతోందని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 18వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అంతర్జాతీయ సమాజం మద్దతును ఇజ్రాయిల్‌ కోల్పోతోందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లో రక్తపాతం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయిల్‌ చరిత్రలోనే అత్యంత కన్జర్వేటివ్‌ ప్రభుత్వం ఇదని బైడెన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ జాతీయ భద్రతా మంత్రి ఇతమార్‌ బెన్‌ గివిర్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇజ్రాయిల్‌లోని ఈ ప్రభుత్వం పరిస్థితులను చాలా కష్టతరం చేస్తోందని అన్నారు. ”ప్రాంతాన్ని ఐక్యం చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు మనకు అవకాశం వుంది. దాన్ని చేయాలని వారనుకుంటున్నారు. కానీ, ఈ క్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి నెతన్యాహు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వుంది. పాలస్తీనా దేశానికి మీరు నో చెప్పలేరు. అది చాలా కఠినమైన అంశంగా వుండనుంది.” అని బైడెన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ కేబినెట్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ ఇజ్రాయిల్‌కు వెళ్ళనుండడం కీలక పరిణామంగా వుంది. హమస్‌ను నాశనం చేయాలన్న లక్ష్య సాధనకు అమెరికా మద్దతు తమకు వుందని గత వారమే నెతన్యాహు చెప్పారు.

➡️