సామూహిక కాల్పుల్లో ఆహారం కోసం ఎదురుచూస్తున్న 11 మంది మృతి

Mar 13,2024 14:03 #11members, #died, #israel hamas war

గాజా : కాల్పుల విరమణపై ఆశలు కోల్పోయిన గాజా నగరంలో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్‌ మారణహోమం కొనసాగిస్తూనే వుంది. ఆకలి తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న వారిపై మళ్లీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో గాజా సిటీలో ఆహార పొట్లాల కోసం ఎదురుచూస్తున్న 11 మంది మృతి చెందారు. 25 మంది క్షతగాత్రులను అల్షిఫా ఆసుపత్రిలో చేర్చారు. ఆహార పొట్లాల కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ ట్యాంకులు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపాయి. దీంతో గాజాలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై సామూహిక కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 400కు చేరుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ చేత చంపబడిన వారి సంఖ్య 31,184 దాటింది. సోమవారం నుంచి ప్రారంభమైన రంజాన్‌ ఉపవాస దీక్షలతో గాజాలో ఆకలిదప్పులు తారాస్థాయికి చేరుకున్నాయి. ధ్వంసమైన చర్చిలు, భవనాల ముందు ప్రార్థనలు జరిగాయి. ఉత్తర గాజాలో 2,000 మంది ఆరోగ్య కార్యకర్తలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు.

➡️