క్షామానికి అడుగు దూరంలో 5,76,000మంది 

  • గాజాలో పరిస్థితులపై ఐరాస హెచ్చరిక 
  • ఆహారం కోసం బారులు తీరినవారిపై విచక్షక్షణారహితంగా కాల్పులు

న్యూయార్క్‌, గాజా : సైన్యం విచక్షణారహితంగా జరిపే యుద్ధంతో దిక్కుతోచని స్థితిలో వున్న పాలస్తీనియన్లకు సహాయం అందకుండా ఒక పద్ధతి ప్రకారం అడ్డుకుంటోందంటూ ఐక్యరాజ్య సమితి అధికారి ఇజ్రాయిల్‌ను విమర్శించారు. గాజాలో నాలుగో వంతు జనాభా అంటే దాదాపు 5,76,000 మంది కరువు కాటకాలకు కేవలం ఒక్క అడుగు దూరంలో వున్నారని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ (ఒసిహెచ్‌ఎ) డిప్యూటీ చీఫ్‌ రమేష్‌ రాజసింగమ్‌ భద్రతామండలిలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. రెండేళ్ళలోపు పిల్లల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వయస్సుకు తగిన ఎదుగుదల వారిలో లేకుండా పోతోందన్నారు. వాస్తవానికి గాజాలోని 23లక్షల మంది ప్రజలకు బతకడానికి సరిపడా ఆహారం లేదని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి అత్యవసరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, గాజాలో విస్తృత స్థాయిలో క్షామం అనివార్యమవుతుందని, మరింతమంది బాధితులను బలి తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.

గాజాలోకి కనీస స్థాయిలో ఆహార సరఫరాలను అందించేందుకు గానూ సహాయ గ్రూపులు తీవ్ర అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటున్నాయని రాజసింగమ్‌ చెప్పారు. క్రాసింగ్‌లు మూసివేయడం, కదలికలపై, కమ్యూనికేషన్‌పై ఆంక్షలు విధించడం, సుదీర్ఘ ప్రక్రియలు, అశాంతి, దెబ్బతిన్న రహదారులు, పేలకుండా వుండిపోయిన పేలుడు పదార్ధాలు వంటివి కారణాలుగా చెప్పారు. ఉత్తర గాజాలో ఆహారం కోసం క్యూలు కట్టి నిలుచున్న ప్రజలపై ఇజ్రాయిల్‌ బలగాలు మళ్లీ కాల్పులు ప్రారంభించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు వెలువడ్డాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా లేదా గాయపడ్డారా లేదా అనేది తెలియరాలేదు. ఐదో నెల్లోకి అడుగిడిన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 29,878మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాజాకు సాయమందించడం దాదాపు అసాధ్యమై పోతోందని జెనీవాలో ఒసిహెచ్‌ఎ మరో ప్రతినిధి జేన్స్‌ లార్కె వ్యాఖ్యానించారు. సహాయం తీసుకువచ్చే బృందాలపై తరచుగా దాడులకు తెగబడుతున్నారని, సాయమందించే కార్యకర్తలు, వర్కర్లపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదిలావుండగా, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే సాయాన్ని మరింత విస్తరిస్తామని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ప్రకటించింది. 15వేల మెట్రిక్‌ టన్నుల ఆహారం తీసుకుని వస్తున్న దాదాపు వెయ్యి ట్రక్కులు ఈజిప్ట్‌లో కదలడానికి సిద్ధంగా వున్నాయన్నారు.

➡️