థానే రసాయనాల ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌ ! – 8మంది మృతి

8మంది మృతి, 60మందికి పైగా గాయాలు
ఫ్యాక్టరీలో చిక్కుకున్న మరికొంతమంది ?
నాలుగు గంటలకు పైగా శ్రమించిన తర్వాత అదుపులోకి మంటలు
థానే : ముంబయికి సమీపంలోని థానే రసాయనాల ఫ్యాక్టరీలో గురువారం తీవ్ర పేలుళ్ళు జరిగిన ఘటనలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మరణించగా 60మంది గాయపడినట్లు థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. ఫేజ్‌ 2 డాంబివ్లి పారిశ్రమిక ప్రాంతంలో అముదాన్‌ కెమికల్‌ కంపెనీలో బాయిలర్‌ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ముంబయికి దాదాపు 40కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ది కార్పొరేషన్‌ (ఎంఐడిసి) ఏరియాలో ఈ ఫ్యాక్టరీ వుంది. కాగా మరికొంతమంది కార్మికులు ఇంకా ఫ్యాక్టరీ లోపల చిక్కుకుపోయినట్లు భయపడుతున్నారు. వారంతా పగటి షిఫ్ట్‌లో పనిచేస్తున్నవారని భావిస్తున్నారు. వారి కోసం సహాయక సిబ్బంది డ్రోన్‌లను ఉపయోగించి గాలిస్తున్నారు. మధ్యాహ్నం 1.40గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యాక్టరీల్లో కూడా వెంటవెంటనే మూడు నుండి నాలుగు పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుళ్ళ కారణంగా దట్టమైన పొగతో ఆ ప్రాంతంమంతా నిండిపోయింది. సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సందర్శించారు. గాయపడిన వారి చికిత్సకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధితులకు వారం రోజుల్లోగా నష్టపరిహారం అందేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 8మందిని సహాయక సిబ్బంది కాపాడారని చెప్పారు. దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని,. మొత్తంగా మంటలను అదుపు చేసేందుకు నాలుగు గంటలకు పైనే పట్టిందని అధికారులు తెలిపారు.
కాగా పేలుళ్ళ ధాటికి ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి పడింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని పలు భవనాలు కంపించాయి. సమీప ఇళ్ళలోని కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయని, కొన్ని ఇళ్ళు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. బాయిలర్‌ పేలుడుతో వెలువడిన వేడికి అత్యంత భారీగా వున్న ఇనుప కడ్డీలు కూడా వంగిపోయాయి. ఆ చుట్టుపక్కల గల ఫ్యాక్టరీల పైకప్పులన్నీ ఎగిరిపోయాయి. వీటివల్ల కూడా తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. పేలుడు చాలా తీవ్రంగా వుందని, ఆ శబ్దాలు కిలోమీటరుకు పైగా దూరం కూడా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ప్రాంతంలోనే గల సాయిబాబా గుడిలో ఆ సమయంలో చాలామంది భక్తులు వున్నారు, ఈ పేలుళ్ళతో భయపడిన వారు అక్కడ నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి పరుగులెత్తారు. ఈ మంటలు పక్కనే గల రెండు భవనాలకు, కార్ల షోరూమ్‌కు వ్యాపించాయి. అనేక వాహనాలు కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
గాయపడిన వారందరికీ తక్షణమే చికిత్సనందించే ఏర్పాట్లు చేశామని, అంబులెన్సులు కూడా మరిన్ని వస్తున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది బలగాలు రంగంలో దిగాయని చెప్పారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. సహాయక చర్యల నిమిత్తం పలు బృందాలు, పాలనాపరమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు.
ఈ పేలుడుకు దారి తీసిన కారణాలపై కూలంకషంగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కారకులెవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే ముందుగా సహాయక చర్యలకే ప్రాధాన్యతనిచ్చామని ఫడ్నవిస్‌ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి ఉదరు సమంత్‌, స్థానిక ఎంపి శ్రీకాంత్‌ షిండే, ఎంఎల్‌ఎ రాజు పాటిల్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

➡️