పర్యావరణానికి పెను ముప్పు !

Jun 18,2024 23:51 #Gaza, #Israeli monstrosity, #UN

గాజాలో ఇజ్రాయిల్‌ రాక్షసత్వంపై ఐరాస
మరో శరణార్ధి శిబిరంపై దాడి
17మంది పాలస్తీనీయుల మృతి
గాజా : నెలల తరబడి గాజాలో కొనసాగుతున్న రాక్షస దాడులు అక్కడి పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల వల్ల గాజా ప్రాంతంలో నేల, నీరు, గాలి తీవ్రంగా కలుషితమై పోయాయని తెలిపింది. పారిశుధ్య వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, నిత్యం కొనసాగుతున్న పేలుళ్లతో టన్నుల కొద్దీ శిథిóలాలు పేరుకుపోయాయని వివరించింది. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న రాక్షస దాడుల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టంపై ఐక్యరాజ్య సమితి ఒకనివేదిక వెలువరించింది. గాజా ప్రాంతంలో ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చడం, వృధా నీటి నిర్వహణకు ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ ఇజ్రాయిల్‌ దాడుల్లో ధ్వంసమయ్యాయని ఐరాస పర్యావరణ కార్యక్రమం ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే గాజా తీరప్రాంత చిత్తడి నేలలు, సౌర విద్యుత్‌ రంగంలో పెట్టిన పెట్టుబడులన్నీ నాశనమయ్యాయని తెలిపింది. పేలుడు పదార్ధాలు, ఆయుధాల వల్ల దాదాపు 3.9కోట్ల టన్నుల శిధిలాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయని పేర్కొంది. గాజాలోని ప్రతి చదరపు మీటరు ప్రాంతంలోను 107కిలోల శిధిలాలు పడి వున్నాయని తెలిపింది. 2017లో ఇరాక్‌లోని మోసుల్‌ నగరంపై జరిగిన బాంబు దాడుల్లో పేరుకుపోయిన శిధిలాల కన్నా ఇవి ఐదు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది.
మృత్యు కోరల్లో 3500 మంది పిల్లలు
గాజా ప్రాంతంలోకి ఆహారం, మందులు, నీరు, విద్యుత్‌ సరఫరాలను ఇజ్రాయిల్‌ అడ్డుకోవడంతో 3,500 మంది చిన్నారులు మృత్యు కోరల్లో చిక్కుకున్నారు. మానవతా సాయం అందకుండా ఇజ్రాయిల్‌ క్రాసింగ్‌లను మూసివేయడంతో అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుండి వచ్చే ఆహారం, ఇతర సామాగ్రి గాజాకు అందడం లేదు. దీంతో పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో నుస్రత్‌ శరణార్ధ శిబిరంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 17మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు వున్నారు. సోమవారం రాత్రంగా ఈ దాడులు కొనసాగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రఫాలో ఆహార ట్రక్కుల కోసం వేచి చూస్తున్న వారిపై దాడులు జరగడంతో 9మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు తెలిపారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకు గాజా దాడుల్లో 37,372 మంది మరణించగా, 85,452మంది గాయపడ్డారు.

➡️