ఆశ, అవరోధాల మధ్య వాతావరణ చర్చలు

Dec 7,2023 09:00 #Climate Changes, #COP Summit
cop summit 23 protest

పురోగతి సాధనపై కాప్‌ 28 నేతల ఊగిసలాట
దుబాయ్ : కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు ప్రారంభమై వారం గడిచింది. కాప్‌28 సదస్సు ప్రారంభంలోనే నష్టపరిహారం నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా సత్వర కార్యాచరణను, ఒప్పందాన్ని ఆమోదించిన నేతల చర్చలు ప్రస్తుతం ఆశలు, అవరోధాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ”చర్చలు ఇప్పుడు మిశ్రమ స్పందనగా వున్నాయి. కొన్ని రంగాలకు సంబంధించి దేశాల మధ్య పెద్ద తేడాలే కనిపిస్తున్నాయి.” అని జర్మనీ వాతావరణ దూత జెన్నిఫర్‌ మోర్గాన్‌ వ్యాఖ్యానించారు. ‘అయితే పురోగతి సాధించేందుకు సంకల్పం మాత్రం వుంది.” అని స్పష్టం చేశారు. చమురు, గ్యాస్‌, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను దశలవారీగా రూపుమాపాలని కోరుతున్న ప్రతిపాదకులు ఇన్నేళ్ళలో మొదటిసారిగా చర్చల పట్ల ఆశాభావంతో వున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, అది ఎక్కడ దాడి చేస్తుందో కూడా చూడాల్సి వుంటుందన్నారు. పేద దేశాలకు ఆర్థిక సాయం అందించాలనే కీలకమైన అంశాలపై ఎలా ముందుకు సాగాలనే విషయమై ఇంకా కసరత్తు జరగాల్సి వుందని అధికారులు తెలిపారు. నష్టపరిహార నిధిని సదస్సు మొదటి రోజే ప్రకటించగా, ఇప్పటివరకు 720 మిలియన్ల డాలర్లుకు పైగా ఆ నిధికి అందాయి. అయితే ఈ విజయానికి ఇక్కడతో ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి వీల్లేదని ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యదర్శి సైమన్‌ స్టిల్‌ బుధవారం హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య వాయువులను తగ్గించేందుకు అవసరమైన కోట్లాది డాలర్ల ఆర్థిక సాయం సమస్యను ఇది పరిష్కరించిందని భావిస్తున్నారు. కాప్‌ అధ్యక్ష వర్గంలో నెంబరు టూ స్థానంలో వున్న, ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్త అద్నన్‌ అమిన్‌ మాట్లాడుతూ, చర్చల పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని చర్చల ప్రక్రియల్లోనూ ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో కూడా అంతే, అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కొంత సానుకూలత, ఆశాభావం నెలకొన్నాయన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడానికి ఉద్దేశించి ప్రపంచ దేశాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, లక్ష్యాల సాధనపై ప్రధానంగా చర్చలు కేంద్రీకరించబడ్డాయి. మంగళవారం ఒక ముసాయిదా డాక్యుమెంట్‌ను 24 పేజీలతో రూపొందించారు. కానీ వచ్చే వారంతో సదస్సు ముగిసిపోతున్న నేపథ్యంలో ఏ అంశాలపై అంగీకారం కుదిరింది, ఒప్పంద అంశాలేంటనే విషయాలపై సదస్సు ఎలాంటి సంకేతాలను ఇవ్వలేదు. 197 దేశాల ప్రతినిధులూ దీనిపై చర్చిస్తున్నారని, అనేక డిమాండ్లు, అవసరాలు వున్నాయని, ముందుకు సాగేందుకు ఈ చర్చలు మంచి ప్రాతిపదిక ఇస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సమయంలో మనం విఫలమైతే పర్యవసానాలు భయంకరంగా వుంటాయన్నారు. శిలాజ ఇంధనాలకు సంబంధించి ఉపయోగించాల్సిన పదజాలం, భాషపై ఐక్యరాజ్య సమితి అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. మండుతున్న బొగ్గు, చమురు, వాయువులు వాతావరణ మార్పులకు ప్రధాన కారకాలుగా వున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా సాగతున్న చర్చల ప్రక్రియలో మొదటిసారిగా ఈ మూడు అంశాలను ఎజెండాలో నుండి తొలగించే ఆలోచన చేస్తున్నారు. ఉపయోగించే భాష లేదా పదజాలం, సమయం, అర్ధం వంటి వాటికి సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి వుందని స్టిల్‌ అన్నారు.

➡️