నైగర్‌ నుంచి చివరి ఫ్రెంచ్‌ సైనికుడి నిష్క్రమణ

Dec 25,2023 11:43 #Niger
  • రాయబార కార్యాలయం మూసివేత

నియామే  :   నైగర్‌ కొత్త ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటమ్‌ మేరకు ఆ గడ్డ మీది నుంచి తమ దళాలను ఫ్రెంచ్‌ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకుంది. గత చాలా కాలంగా తిష్టవేసుక్కూచొన్న 1500 మంది తన సైనికుల్లో ఆఖరి 50 మంది ఫ్రెంచ్‌ సైనికులు శనివారం నిష్క్రమించారు. దీంతో నైగర్‌ నుంచి ఫ్రెంచ్‌ సైన్యాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లైంది. చివరి ఫ్రెంచ్‌ దళాలు నైగర్‌ నుంచి నిష్క్రమించడానికి కొన్ని గంటల ముందు నియామెలోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. దళాల ఉపసంహరణకు సంబంధించిన ఒక ఉమ్మడి ప్రకటనపై నైగర్‌ సైనికాధిపతి మమనే సాని కియావు, ఫ్రెంచ్‌ సైనిక ప్రతినిధి ఎరిక్‌ ఓజాన్‌ శుక్రవారం సంతకాలు చేశారు.

నైగర్‌ సైన్యం విడుదల జేసిన పత్రికా ప్రటకన ప్రకారం సైనిక ఉపసంహరణ అంతా నిర్దిష్ట కాల ప్రణాళిక ప్రకారమే జరిగింది. అక్టోబరు 10న ఫ్రెంచ్‌ సైనికుల మొదటి కాన్వాయ్  ఉపసంహరణ జరిగింది. జులై 26న నైగర్‌లో సైనిక తిరుఉగబాటు ద్వారా అధ్యక్షుడు మొహమ్మద్‌ బజౌమ్‌ను నిర్బంధించి, అధికారం చేజిక్కించుకున్న ఆ దేశ ప్రెసిడెన్షియల్‌ గార్డు మాజీ చీఫ్‌ అబ్దురహమనే ట్సియాని ఫ్రెంచ్‌ దళాలను దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఫ్రాన్స్‌, నైగర్‌ మధ్య సంబంధాలు పేకమేడలా ఒక్కసారి కుప్పకూలాయి. నైగర్‌ వాసులకు ఫ్రాన్స్‌ వీసాలను నిలిపివేసింది. నైగర్‌ సైనిక ప్రభుత్వం అల్టిమేటమ్‌ ఇవ్వడంతో 2023 చివరి నాటికి సైనిక దళాలను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమానియెల్‌ మాక్రాన్‌ ప్రకటించారు.

➡️