నిన్ను నరహంతకుడిగానే చరిత్ర చూస్తుంది-గుస్తావో పెట్రో

May 13,2024 00:42 #Gaza

గాజా :గాజాలో పెద్దయెత్తున మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుపై కొలంబియా తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మిస్టర నెతన్యాహు! వేలాది మంది అమాయక పౌరులపై బాంబులేసి చంపడం హీరోయిజం అనిపించుకోదు. చరిత్ర నిన్ను నరహంతకుడిగానే చూస్తుంది. ఐరోపాలో లక్షలాది మందిని చంపిన ఫాసిస్టు హిట్లర్‌కు, మీకు తేడా లేదు’ అని పెట్రో విమర్శించారు. అంర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెట్రో మాట్లాడుతూ, ‘పాలస్తీనా దేశాన్ని మొత్తంగా తుడిచేసేందుకు ఇజ్రాయిల్‌ పాల్పడుతుంటే మనం చేష్టలుడిగినట్లు కూర్చోలేం. పాలస్తీనా అదృశ్యమవడం అంటే మానవాళి కనుమరుగవడంతో సమానం. అందుకే దురాక్రమణదారు అయిన ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాం ‘ అని చెప్పారు. ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న రెండవ లాటిన్‌ అమెరికా దేశం కొలంబియా. అంతకుముందు బలీవియా ఈ పని చేసింది. కొలంబియా తరువాత హోండూరస్‌, మెక్సికో సమీపంలోని బెలిజ్‌ కూడా ఇదే బాటలో నడిచాయి.
హిట్లర్‌ను తలపిస్తున్న నెతన్యాహు: ఎర్డోగన్‌
హిట్లర్‌ అనుసరించిన క్రూరమైన పద్ధతులనే నెతన్యాహు పాలస్తీనీయుల ఊచకోతకు అనుసరిస్తున్నాడని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ విమర్శించాడు. గతంలో హిట్లర్‌ గ్యాస్‌ చాంబర్‌లోపెట్టి వేలాది మంది అమాయక పౌరులను సామూహికంగా చంపడం, యూదులు నివసించే ప్రాంతాలను దిగ్బంధించి వారికి నీరు, ఆహారం, మందులు, ఇంధనం అందకుండా చేయడం ద్వారా వారు ఆకలితో చనిపోయేలా చేశాడు. ఇప్పుడు నెతన్యాహు అవే పద్ధతులను అనుసరిస్తున్నాడని అన్నారు.
విద్యార్థుల ఉద్యమం విస్తరణకు యత్నాలు
గాజాకు సంఘీభావంగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు ఏప్రిల్‌ 18న ప్రారంభించిన గుడారాల ఉద్యమం దావానలంలా వ్యాపించి అనతి కాలంలోనే 80 యూనివర్సిటీలకు విస్తరించింది. అటు నుంచి ప్రపంచ నలుమూలలకూ పాకింది. విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ఈ ఉద్యమం వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకున్నా అమెరికా ప్రభుత్వం, యూనివర్సిటీల యాజమాన్యాలు హింసాత్మక పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నాయి. విద్యార్థులు ప్రారంభించిన ఈ సంఘీభావ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కొత్త మార్గాల గురించి ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపక సిబ్బంది దృష్టి సారించారు. మే8న మొదటి ఫ్యాకల్టీ నిరసన గుడారాలన్ని న్యూయార్క్‌ సిటీలో ది న్యూ స్కూల్‌ ఫ్యాకల్టీ ప్రారంభించారు. రిటైర్డు టీచర్లు కూడా వీరికి మద్దతుగా ముందుకొస్తున్నారు. నార్త్‌ కరోలినా నుండి కాలిఫోర్నియా వరకు కళాశాలలు, వివ్వ విద్యాలయాల స్నాతకోత్సవాల్లో గాజాలో ఇజ్రాయిల్‌ దుర్మార్గాలను నిరసిస్తూ కొందరు నినదించారు. వర్జీనియాలోని కామన్వెల్త్‌ యూనివర్సిటీలో డజన్ల కొద్దీ విద్యార్థులు గాజాకు సంఘీభావంగా గొంతెత్తారు.

ఇజ్రాయిల్‌ ఊచకోతపై
ఐసిజెలో ఈజిప్టు కేసు
గాజాలో ఇజ్రాయిల్‌ ఊచకోతకు పాల్పడడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని బాహాటంగా అతిక్రమించిందని ఈజిప్టు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నెతన్యాహును యుద్ధ నేరస్తునిగా ప్రకటించాలని కోరుతో ఒక పిటిషన్‌ వేసింది. ఇజ్రాయిల్‌ యుద్ద ట్యాంకులు రఫాలోను, ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపైన దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈజిప్టు ఈ చర్య తీసుకుంది. హమాస్‌పై పోరు పేరుతో అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటున్న నెతన్యాహు దురాగతాలపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ప్రభుత్వాలు మాత్రం ఇజ్రాయిల్‌కు మద్దతు కొనసాగిస్తూనే ఉన్నాయి.

➡️