ఇజ్రాయిల్‌ మారణకాండ

israel-hamas-war-live-updates-raids-gaza-al-shifa-hospital-fuel-us-benjamin-netanyahu-palestine
  • ఖాన్‌ యూనిస్‌లో ఇంటిపై దాడి : 22మంది పాలస్తీనియన్ల మృతి 
  • ప్రధాన బాధితులు చిన్నారులేనన్న యునిసెఫ్‌
  • ఇజ్రాయిల్‌ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్‌ దాడులు

గాజా : ఖాన్‌ యూనిస్‌ నగరంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన దాడిలో 22మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ నగరం సురక్షిత ప్రాంతమనుకుని ఇక్కడకు తమ కుటుంబం తరలివచ్చిందని, కానీ ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో తాను మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా మరణించారని 11 ఏళ్ల బాలుడు ఏడుస్తూ మీడియాకు తెలిపాడు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేంవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. అనేకచోట్ల పాలస్తీనియన్ల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని వార్తలందుతున్నాయి. గాజా ప్రాంతం పాలస్తీనియన్లకు మృత్యుకుహరంలా మారిందని ఐక్యరాజ్య సమితి మానవతా కార్యకలాపాల విభాగం చీఫ్‌ వ్యాఖ్యానించారు. హమస్‌ డిప్యూటీ నేత అల్‌ అరౌరి మృతికి కారణమైన ఇజ్రాయిల్‌ దాడిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లెబనాన్‌ అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసింది. గాజాలో పౌరులపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే ముగించాలని పాలస్తీనా స్వతంత్ర మానవ హక్కుల కేంద్రానికి చెందిన న్యాయవాది బహజత్‌ అల్‌ హెలో విజ్ఞప్తి చేశారు. రాఫా నగరం నుంచి ఆయన మాట్లాడుతూ పాలస్తీనియన్లుగా అత్యంత క్లిష్టమైన, బాధాకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నామన్నారు. 20లక్షల మందికి పైగా ప్రజలు బందీలుగా వున్నారని అన్నారు. ఇజ్రాయిలీ బలగాల విచక్షణారహిత దాడులతో రోజూ చావు అంచుల వరకు వెళుతున్నామని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచం నోరెత్తకుండా మౌనం పాటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను జవాబుదారీ చేసేలా ఒక్క చర్య కూడా తీసుకోవడంలో యావత్‌ ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని అన్నారు.

గాజాలో చిన్నారులందరూ తీవ్రమైన పోషకాహార లోపానికి గురవుతున్నారని, తీవ్ర స్థాయిలో భయకంపితులవుతున్నారని యునిసెఫ్‌ పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న మానవతా సంక్షోభంలో ప్రధాన బాధితులు చిన్నారులేనని యునిసెఫ్‌ ప్రతినిధి టెస్‌ ఇన్‌గ్రామ్‌ వ్యాఖ్యానించారు.

హమస్‌ నేతను హత్య చేయడానికి ప్రతిస్పందనగా హిజ్బుల్లా రాకెట్‌ దాడులకు పాల్పడింది. మెరాన్‌ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు హిజ్బుల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 62 రాకెట్లతో ఇజ్రాయిల్‌ మిలటరీకి కీలకమైన పోస్టును లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఉత్తర ఇజ్రాయిల్‌వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వైమానిక దాడులను సూచిస్తూ సైరన్లు మోగాయి.

➡️