ఇజ్రాయెల్‌ దాడుల్లో 89 మంది జర్నలిస్టులు మృతి

Dec 14,2023 16:01 #Gaza, #Journalist

 

గాజా : అక్టోబర్‌ 7వ తేదీ నుంచి  ఇజ్రాయెల్‌ సైన్యం వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌ సైన్యం దాదాపు 89 మంది జర్నలిస్టుల్ని హతమార్చింది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచానికి సమాచారాన్ని అందజేస్తున్న జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ సైన్యం చంపడాన్ని పాలస్తీనియన్‌ జర్నలిస్ట్స్‌ సిండికేట్‌ (పిజెఎస్‌) తీవ్రంగా ఖండించింది. తాజాగా ఉత్తర గాజాలో ఇజ్రాయెల్‌కి చెందిన ఓ వ్యక్తి అబేద్‌ అల్కరీమ్‌ ఔడా అనే జర్నలిస్టుపై కాల్పులు జరిపాడు. అతను బుధవారం మృతి చెందాడు. అలాగే రష్యా టు డేలో ట్రైనీగా పనిచేస్తున్న మరో మహిళా జర్నలిస్ట్‌ నెర్మిన్‌ కవాస్‌ ఇంటిపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు హత్యకు గురైన జర్నలిస్టుల్లో పదిమంది మహిళా జర్నలిస్టులు ఉన్నట్టు పిజెఎస్‌ గుర్తించింది. కేవలం జర్నలిస్టుల్ని మాత్రమేకాదు.. వార్తా సంస్థల ప్రధాన కార్యాలయాల్ని కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ధ్వంసం చేసిందని పిజెఎస్‌ విమర్శించింది. కాగా, హత్యకు గురైన వారిలో అల్‌ మయాదీన్‌ ఛానెల్‌కి చెందిన ఇద్దరు లెబనీస్‌ జర్నలిస్టులు ఫరా ఒమర్‌, రబీV్‌ా అల్‌ మామరి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన యూరోపియన్‌ సమ్మిట్‌ సమావేశంలో పిజెఎస్‌, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఐఎఫ్‌జె) ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ శాశ్వత కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తీసుకురావాలని యూరోపియన్‌ పార్లమెంట్‌లోని ప్రగతిశీల సభ్యులను పిజెఎస్‌, ఐఎఫ్‌జె ప్రతినిధులు కోరారు. జర్నలిస్టుల హత్యలపై దర్యాప్తు జరిపి నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని, అందుకు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) ఒత్తిడి చేయాలని వారు అభ్యర్థించారు. ఈ యూరోపియన్‌ సమ్మిట్‌ సమావేశంలో పిజెఎస్‌ అధ్యక్షుడు నాసర్‌ అబూ బేకర్‌ మాట్లాడుతూ.. ‘గాజాలో నా సహచరులు నీరు, ఆహారం, నివాసం లేక దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇజ్రాయెల్‌ బాంబు దాడుల కారణంగా చాలామంది జర్నలిస్టులు, వారి కుటుంబాలు నివాసం కోల్పోయి వీధులు, పాఠశాలలు, ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ఉంటున్నారు.’ అని అన్నారు. ఇక ఈ సమావేశంలో ఐఎఫ్‌జె సెక్రటరీ ఆంథోనీ బెల్లంగర్‌ మాట్లాడుతూ.. ‘వివిధ దేశాల రిపోర్టర్‌లను గాజాలోకి ఇజ్రాయెల్‌ సైన్యం అనుమతించడం లేదు. ఇజ్రాయెల్‌ వారి అనుమతిని నిరాకరించడాన్ని నేను తిరస్కరిస్తున్నాను. అంతర్జాతీయ చట్టం నిర్దేశించిన విధంగా కమ్యూనికేటర్‌లను సైనిక లక్ష్యాలుగా పరిగణించరాదు.’ అని ఆయన డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 7 నుంచి కొనసాగుతున్న హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం వల్ల ఇప్పటివరకు 18,608 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 50,594 మంది గాయాలపాయ్యారు.

➡️