ఇజ్రాయిల్‌కు, అమెరికాకు ముప్పు తప్పదు

  •  టెహ్రాన్‌లో భారీ ప్రదర్శనలు

టెహ్రాన్‌ : సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్‌ కాన్సులేట్‌ కార్యాలయంపై దాడికి పాల్పడి సీనియర్‌ కమాండర్లతో సహా పలువురు సైనిక సలహాదారుల మృతికి కారణమైన ఘటనకు తప్పకుండా ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ ప్రతిన చేశారు. ఆ దాడిలో మృతి చెందినవారి అంత్యక్రియల సందర్భంగా వేలాదిమంది టెహరాన్‌ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ‘ఇజ్రాయిల్‌కు ముప్పు తప్పదు’, అమెరికాకు ముప్పు తప్పదు’ అని నినాదాలు చేశారు. టెహరాన్‌తో పాటూ పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందినవారు ఏడుగురితో సహా మొత్తం 13 మంది చనిపోయారు. టెహరాన్‌లో ప్రదర్శకులందరూ టెహరాన్‌ వర్శిటీ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సలామీ ప్రసంగించారు. ఇజ్రాయిల్‌ జరిపిన ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
కచ్చితంగా ఈ దాడికి బదులిస్తామన్నారు. నెతన్యాహు ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. అమెరికాను ప్రపంచం యావత్తూ ముఖ్యంగా ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. 1979 ఇస్లామిక్‌ రివల్యూషన్‌ జరిగినప్పటి నుండి రంజాన్‌ పవిత్ర మాసం చివరి శుక్రవారం నాడు జెరూసలేం డే పేరుతో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈసారి మిలటరీ జనరల్స్‌ అంత్యక్రియలు కూడా ఇదే రోజుజరగడంతో పాలస్తీనాకు మద్దతుగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్‌ జనరల్స్‌ మృతదేహాలను తీసుకుని వెళుతున్న ట్రక్కు వెనక వేలాదిగా ఇరానియన్లు ప్రదర్శన నిర్వహించారు.

➡️