జపాన్‌లో జననాల సంక్షోభం

Feb 29,2024 08:58 #Japan
Japan's fertility crisis
  • గతేడాది రికార్డు స్థాయిలో పతనం 
  • వివాహం, కుటుంబం వంటి అంశాలపై దృష్టి పెట్టని యువత

టోక్యో : గతేడాది జపాన్‌లో జననాల సంఖ్య బాగా పడిపోయింది. వరుసగా ఎనిమిదేళ్ళుగా తగ్గుతూ వస్తున్న జననాలు ఈసారి రికార్డు స్థాయిలో పడిపోయాయి. రాబోయే ఆరేళ్లలో ఈ ధోరణిని మార్చకపోతే జపాన్‌ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఉన్నతాధికారి ఒకరు అన్నారు.. 2023లో 7,58,631మంది శిశువులు జన్మించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 5.1శాతం మేరా జననాల సంఖ్య క్షీణించిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1899 నుండి జననాలు, మరణాల గణాంకాలను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుండి అత్యంత తక్కువగా నమోదైన ఏడాదిగా 2023 సంవత్సరం రికార్డు సృష్టించింది. వివాహాల సంఖ్య కూడా 5.9శాతం తగ్గిపోయి 4,89,281మందే పెళ్ళిళ్లు చేసుకున్నారు. గత 90ఏళ్ళలో మొట్టమొదటిసారిగా 5లక్షల కన్నా తక్కువకు ఈ సంఖ్య పడిపోయింది. జననాల సంఖ్య తగ్గడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. పితృస్వామ్య సంప్రదాయం ఆధారంగా కుటుంబ విలువలు వున్న జపాన్‌ సమాజంలో వివాహేతర జననాలు చాలా అరుదనే చెప్పాలి. వివాహం చేసుకోవడానికి, పిల్లల్ని కని కుటుంబాలను పెంచుకోవడానికి యువత వెనుకడుగు వేస్తోందని సర్వేలు తెలియచేస్తున్నాయి. అంతంత మాత్రంగానే ఉద్యోగావకాశాలు, వేగంగా పెరుగుతూ పోతున్న జీవన వ్యయం, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వచ్చే కార్పొరేట్‌ సంస్కృతులు ఇవన్నీ కూడా కారణాలుగానే వున్నాయి. ఇలా తగ్గుతూ వస్తున్న జననాల రేటు చాలా కీలకమైన దశలో వుందని చీఫ్‌ కేబినెట్‌ కార్యదర్శి యోషిమస హయాషి విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి వచ్చే ఆరేళ్లు వుంటే ఇక యువ జనాభా కూడా గణనీయంగా తగ్గడం ఆరంభమవుతుందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇదే చివరి అవకాశమని, ఇక సమయం వృధా చేయడానికి లేదని అన్నారు.

జపాన్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం ఇదేనని ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆందోళన వ్యక్తం చేశారు. జననాల సంఖ్య పెంచేందుకు అన్ని రకాలుగా రాయితీలు ఇతరత్రా మద్దతును అందచేస్తూ పలు చర్యలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయినా వాటివల్ల పెద్దగా ఉపయోగం వుండడం లేదని యువత వాటిపైనే దృష్టి పెట్టడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

➡️