జాన్‌ పిల్జర్‌ కన్నుమూత

Jan 1,2024 10:10 #passed away
john pilger passed away

 

లండన్‌ : ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుల్లో ఒకరు, హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ మేకర్‌ జాన్‌ పిల్జర్‌ (84) శనివారం నాడు ఇక్కడ తుది శ్వాస విడిచారు. పిల్జర్‌ ఇక లేరన్న వార్తను ఆయన కుటుంబ సభ్యులు ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌) ద్వారా వెల్లడించారు. పాలస్తీనా నుండి కంబోడియా దాకా, వియత్నాం, ఇరాక్‌ దాకా అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణపూరిత యుద్ధాల వల్ల ప్రజలు ఎదుర్కొన్న బాధలను కళ్లకు కట్టినట్లు తన వార్తా కథనాలు, డాక్యుమెంటరీల్లో చూపించారు. కలాన్ని అత్యంత పదునైన ఆయుధంగా ఉపయోగించడంలో ఆయనకు ఆయనే సాటి. సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని మేల్కొలిపేందుకు జీవితాంతం పోరాడిన వ్యక్తి ఆయన. తాజాగా ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై సాగిస్తున్న ఊచకోతను పిల్జర్‌ తీవ్రంగా విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియస్‌ అసాంజెకు బాసటగా నిలిచారు. ఆస్ట్రేలియాలో జన్మించిన పిల్జర్‌ జర్నలిజంలో రాజీపడని వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. సిడ్నీిలో హైస్కూల్‌ స్థాయిలోనే వార్తపత్రికను ప్రారంభించిన పిల్జర్‌ తరువాత యూరప్‌కు వెళ్లారు. 1962లో ఇంగ్లండ్‌లో ఫ్రీిలాన్సర్‌గా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత రాయిటర్స్‌ వార్తా సంస్థలో చేరారు. అటు పిమ్మట లండన్‌ డైలీ మిర్రర్‌కు ప్రధాన విదేశీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రపంచంలో వివిధ యుద్ధాలను కవర్‌ చేశారు. వీటిల్లో వియత్నాం యుద్ధం ప్రధానమైనది. ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వెళ్లిన పిల్జర్‌ 1970వ దశకంలో అమెరికాలో జరిగిన తిరుగుబాట్లపై అనేక కథనాలు రాశారు. అలాగే కంబోడియా, తూర్పు తైమూర్‌ నుంచి పిల్జర్‌ రాసిన కధనాలు సంచలనం సృష్టించాయి. వార్త నివేదికలతో పాటు పలు డాక్యుమెంటరీలను ఆయన రూపొందించారు. పలు పుస్తకాలు రాశారు. ముఖ్యంగా తన సొంత దేశం ఆస్ట్రేలియాపై రూపొందించిన ది సీక్రెట్‌ కంట్రీ (1983), బైసెంటరీ త్రయం ది లాస్ట్‌ డ్రీమ్‌ (1988), వెల్‌కమ్‌ టూ ఆస్ట్రేలియా (1999), యుటోపియా (2013) విశేష ప్రాచుర్యం పొందాయి. అలాగే జర్నలిజంపై రచించిన ‘హిడెన్‌ ఎజెండాస్‌’ పుస్తకం విశేషాదరణ పొందింది.

➡️