జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఐఎఫ్‌జె ..

 బ్రస్సెల్స్‌ :   మీడియా నిపుణులు, జర్నలిస్టుల భద్రతపై జర్నలిస్టుల హక్కుల సంఘం ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఐఎఫ్‌జె) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టుల మృతిపై ఐఎఫ్‌జె శుక్రవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 94 మంది జర్నలిస్టులు మరణించగా, సుమారు 400 మంది జైలు పాలైనట్లు తెలిపింది. మీడియా నిపుణులకు మెరుగైన రక్షణ కల్పించాలని, వారిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. జర్నలిస్టుల రక్షణ కోసం అంతర్జాతీయ నూతన ప్రమాణాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని, సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉందని ఐఎఫ్‌జె అధ్యక్షుడు డొమినిక్‌ ప్రదాలియే పేర్కొన్నారు.

గత 30 ఏళ్లలో సంఘర్షణల్లో మరణించిన వారి కన్నా ఇజ్రాయిల్‌ హమాస్‌ యుద్ధంలో మృతిచెందిన జర్నలిస్టుల సంఖ్య అత్యధికమని పేర్కొంది. హమాస్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధం చేపట్టినప్పటి నుండి సుమారు 68 మంది జర్నలిస్టులు మరణించినట్లు తెలిపింది. ఇది రోజుకి ఒకరి కంటే ఎక్కువ మరియు ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల మృతుల్లో 72 శాతమని పేర్కొంది. గాజాస్ట్రిప్‌లోని పాలస్తీనా జర్నలిస్టులు అత్యధికంగా మరణించడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఇప్పటికీ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడి కొనసాగిస్తోంది. 1990లో విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టులను ఐఎఫ్‌జె నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి గాజాపై జరిగిన యుద్ధంలో కన్నా .. ఏ ఒక్క సంఘర్షణ జర్నలిస్టులకు ప్రాణాంతకంగా మారలేదని తెలిపింది. ఉక్రెయిన్‌ కూడా జర్నలిస్టులకు ప్రమాదరకమైన దేశంగా ఉందని పేర్కొంది. గత రెండేళ్లలో ముగ్గురు రిపోర్టర్లు మరియు మీడియా వర్కర్లు మరణించారని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, భారత్‌, చైనా మరియు బంగ్లాదేశ్‌లలో జర్నలిస్టుల మృతిని  కూడా ఐఎఫ్‌జె ప్రస్తావించింది.

➡️