సింగపూర్‌ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్‌ లూంగ్‌

సింగపూర్‌  :    సుమారు 20 ఏళ్లుగా సింగపూర్‌కు ప్రధానిగా ఉన్న లీసీన్‌ లూంగ్‌ మే 15 పదవిని వీడనున్నట్లు ప్రకటించారు. తన స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ భర్తీ చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం లీసీన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఉప ప్రధాని, ఆర్థిక మంత్రిగా ఉన్న లారెన్స్‌ వాంగ్‌ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారని లీసీన్‌ కార్యాలయం ఓ ప్రకనటలో తెలిపింది. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పిఎపి) లోని చట్టసభ సభ్యులు లారెన్స్‌ వాంగ్‌కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.

పిఎపి అధ్యక్షుడు, సింగపూర్‌ మూడో ప్రధానిగా పనిచేసిన లీ సీన్‌ లూంగ్‌ 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవిని వీడాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.

లీసీన్‌ సింగపూర్‌ మొదటి ప్రధాని లీ కువాన్‌ యూ పెద్ద కుమారుడు. 31 ఏళ్ల తన పదవీకాలంలో సింగపూర్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా నిలిపారు. అయితే కఠినమైన ప్రభుత్వ ఆంక్షలు, మీడియాపై నియంత్రణ, అణచివేత చట్టాలను వినియోగించడం, అసమ్మతి వాదులపై సివిల్‌ కేసులు బనాయించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

➡️