అభిశంసనను ఎదుర్కోనున్న మాల్దీవుల అధ్యక్షుడు

 మాలె :    ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సంతకాలు సేకరిస్తోంది. ఎండిపికి చెందిన చట్టసభ సభ్యుడిని ఉటంకిస్తూ సోమవారం స్థానిక మీడియా తెలిపింది. డెమోక్రాట్లు, ఎండిపి ప్రతినిధులు సహా మొత్తం 34 మంది తీర్మానానికి మద్దతు ఇచ్చినట్లు మాల్దీవ్స్‌ ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ తెలిపింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే   56 మంది ఓట్లు రావాల్సి వుంది. దీంతో మిగిలిన ఓట్ల కోసం ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయి.  కేబినెట్‌ నిర్ణయంపై నిర్వహించిన ఓటింగ్‌ కారణంగా మాల్దీవుల పార్లమెంటు ఆదివారం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపిల తోపులాటలు, ముష్టిఘాతాల దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నేటి సెషన్‌ కోసం ప్రభుత్వం పార్లమెంటులో భారీగా భద్రతాదళాలను మోహరించింది.

➡️