ఉత్తర గాజాలో వైద్య సంక్షోభం

Jan 10,2024 10:32 #crisis, #israel hamas war, #medical
  • 12 రోజులుగా ఆస్పత్రులకు అందని వైద్య సరఫరాలు !
  • డబ్ల్యుహెచ్‌ఓ ఆందోళ

గాజా : ఉత్తర గాజాలో వైద్య సేవలు పూర్తిగా స్థంభించాయి. ఇజ్రాయిల్‌ యుద్ధన్మోదంతో పెను సంక్షోభం నెలకొంది. ఈ ప్రాంతంలో భద్రతాపరమైన హామీలు సరిగా లేకపోవడంతో ఉత్తర గాజాలోని వైద్య సరఫరాల మిషన్‌ను నాల్గోసారి రద్దు చేయాల్సి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా గత 12 రోజులుగా ఉత్తర గాజాలోని ఆస్పత్రులకు వైద్య సరఫరాలను అందచేయలేకపోయామని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గెబ్రియెసెస్‌ చెప్పారు. అత్యవసరంగా, సురక్షితమైన, ఎలాంటి ఆటంకాలు లేని రీతిలో రవాణాకు హామీ కల్పించడం అవశ్యంగా వుందన్నారు. అల్‌ అవదా ఆస్పత్రికి, ఉత్తర గాజాలోని సెంట్రల్‌ ఫార్మసీకి ఔషధాలు అందచేయాల్సి వుందని, కానీ జరగలేదని, డిసెంబరు 26 నుండి ఇలా జరగడం ఇది నాల్గోసారని అన్నారు. ఘర్షణలను నివారించి, భద్రత కల్పిస్తామంటూ తమకు ఎలాంటి హామీలు రాలేదని చెప్పారు. దాడుల్లో గాయపడిన రోగులకు వైద్య సేవలు అందించడానికి ఈ సరఫరాలు చాలా కీలకమని అయినా వాటిని అందచేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా కొనసాగుతున్న దాడులు, రవాణా, కమ్యూనికేషన్‌ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఉత్తర ప్రాంతంలో వైద్య సరఫఱాల రవాణా చాలా క్లిష్టంగా మారింది. పైగా ఆస్పత్రుల్లో ఆరోగ్య సిబ్బంది కూడా కొరతగానే వుందని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 22,830 మంది మరణించగా, 58,400 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

➡️