ఫ్రాన్స్‌లో వలస వ్యతిరేక చట్టానికి మరిన్ని కోరలు

  • ఫాసిస్టు, మితవాద శక్తులతో చేతులు కలిపిన మాక్రాన్‌
  • 349-186 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం

పారిస్‌: మాక్రాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వలస వ్యతిరేక చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు అమలుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమం చేపడతామని వామపక్షాలు, కార్మిక సంఘాలు, జాత్యహంకార వ్యతిరేక ఉద్యమ సంస్థలు ప్రకటించాయి. దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసనకు పిలుపునిచ్చాయి. మెరైన్‌ లీ పెన్‌ నేతృత్వంలోని పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ర్యాలీ, సంప్రదాయవాద రిపబ్లికన్లు దీనికి ఆమోదం తెలిపారు. మరోవైపు, జాతీయ అసెంబ్లీలో బిల్లును ఆమోదించడంపై పార్లమెంటు లోపల, వెలుపల వామపక్ష, ప్రగతిశీల శక్తులు నిరసన తెలిపాయి. పౌరసత్వం , ఇతర సామాజిక ప్రయోజనాలను పొందే విషయంలో ఫ్రాన్స్‌లోని వలసదారులకు ఈ చట్టం కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ బిల్లు ప్రజల మధ్య విభజన తెచ్చేదిగా ఉందని లెఫ్టిస్ట్‌ న్యూ ఎకోలాజికల్‌ అండ్‌ సోషల్‌ పీపుల్స్‌ యూనియన్‌ కూటమిలోని పార్టీలు, జనరల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌తో సహా ట్రేడ్‌ యూనియన్లు, వివిధ హక్కుల సంఘాలు వ్యాఖ్యానించాయి. డిసెంబర్‌ 21 సాయంత్రం, కౌంటీ అంతటా నగరాల్లో బిల్లును నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. వలసదారులు, శరణార్థులపై కఠినమైన ఆంక్షలు విధించాలన్న మితవాద గ్రూపుల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చే విధంగా బిల్లు ఉందని ప్రగతిశీలవాదులు విమర్శిస్తున్నారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 349, వ్యతిరేకంగా 186 ఓట్లు వచ్చాయి. అంతకుముందు సెనేట్‌లో ఇది ఆమోదం పొందింది. దిగువ సభలో సాధారణ మెజారిటీ లేని మాక్రాన్‌ ప్రభుత్వం పునరుజ్జీవనోద్యమ పార్టీ, మితవాద లా రిపబ్లికన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.బిల్లు ఆమోదించడాన్ని మితవాదుల సైద్ధాంతిక విజయంగా లీపెన్‌ అభివర్ణించారు. మరో వైపు మాక్రాన్‌ సొంత పార్టీ నుంచి దీనికి వ్యతిరేకత వ్కక్తమవుతోంది. ఈ బిల్లుకు నిరసనగా ఆరోగ్య మంత్రి ఆరేలియన్‌ రూసో రాజీనామా చేశారు. ఈ బిల్లను ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడు ఫాబియన్‌ రౌసెల్‌ తీవ్రంగా విమర్శించారు. ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ విలువలను సజీవంగా ఉంచాలని కోరుకునే ప్రతి ఒక్కరూ దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు .కుటుంబ భత్యాలు, హౌసింగ్‌ సహాయం మొదలైన సామాజిక ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన కనీస వ్యవధిని ఆరు నెలల నుండి 5 సంవత్సరాలకు ఈ బిల్లులో పొడిగించారు. ఈ అమానవీయమైన బిల్లు ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ గౌరవిస్తున్న ప్రాథమిక ఆదర్శాలు (స్వేచ్ఛ! సమానత్వం! సోదరభావం!)కు విరుద్ధమని వామపక్షాలు విమర్శించాయి. గత రెండు పర్యాయాల అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాన్స్‌ ప్రజలు రెండవ రౌండ్‌లో మాక్రాన్‌కు ఓటు వేశారు, మితవాద నాయకురాలు మెరైన్‌ లీ పెన్‌ అధ్యక్ష పదవిని చేపట్టకుండా అడ్డుకున్నారు.

➡️