కొత్త వైరస్‌ ఏమీ లేదు : సాధారణ శ్వాసకోశ సమస్యలే : సీజీటీఎన్‌ వెల్లడి

Nov 26,2023 11:53 #CGTN, #new virus, #reveals

చైనా : చైనాలో అంతుచిక్కని నిమోనియాలో సరికొత్త వైరస్‌ ఏమీ లేదని అక్కడి ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిశీలన చేపట్టింది. చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ను సంప్రదించింది. ఆసుపత్రుల డైరెక్టర్లతో మాట్లాడి చైనా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక సరైనదేనని స్పష్టం చేసింది. చైనాలో శరవేగంగా వ్యాపించిన శ్వాసకోశ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే కచ్చితమైన సమాచారం అందించిందని సీజీటీఎన్‌ వెల్లడించింది. బీజింగ్‌, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎలాంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని స్పష్టం చేసింది.

అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే….

చైనాలోని చిన్నారుల్లో ఒక్కసారిగా వ్యాపించిన నిమోనియాపై తమకు నివేదిక అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని బీజింగ్‌ పేర్కొందని వెల్లడించింది. బాధితుల్లో ఎలాంటి సరికొత్త వైరస్‌ లేదని వివరణ ఇచ్చినట్లు చెప్పింది. ఈ విషయాన్ని చైనాలోని సీజీటీఎన్‌ కథనంలో వివరంగా పేర్కొంది. చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ను సంప్రదించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…. ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ను సంప్రదించింది. బీజింగ్‌ పిల్లల ఆస్పత్రిని కూడా సమాచారం కోరింది. దీనిపై ఆస్పత్రి శ్వాసకోశ విభాగం డైరెక్టర్‌ ఝావో షన్నియింగ్‌ మాట్లాడుతూ.. ”మేము సీడీసీ నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎలాంటి మార్పు లేదు. రోగులకు చికిత్సలో సంక్లిష్టతలు ఏమీ రాలేదు. మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదు. కానీ, మాకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉంది. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని చెప్పారు.

ముందు జాగ్రత్త చర్యలు…

బీజింగ్‌లోని ది క్యాపిటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగింది. దీంతో రెండో వార్డును కూడా ప్రారంభించారు. బీజింగ్‌లోని చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మళ్లీ మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని చైనా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

చిన్నారుల్లో కొన్నాళ్లుగా అంతుచిక్కని నిమోనియా లక్షణాలు ….

చైనాలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులు కొన్నాళ్లుగా అంతుచిక్కని నిమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్‌ సంస్థ తొలుత అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను ఇటీవల సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ” బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్‌, లియనోనింగ్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని నిమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి ” అని ప్రోమెడ్‌ సంస్థ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారినపడినట్లు వెల్లడించింది.

➡️