మాది కీలుబొమ్మ ప్రభుత్వమే !

Mar 14,2024 08:15 #Pakistan

 నవాజ్‌ పార్టీ సీనియర్‌ నేత
లాహోర్‌ : పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సైన్యం చేతిలో కేవలం కీలు బొమ్మ మాత్రమేనని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సన్నిహితుడొకరు అంగీకరించారు. పరోక్షంగా, సైన్యమే ప్రభుత్వాన్ని నడుపుతుందని సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై పిఎంఎల్‌-ఎన్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు. మాజీ మంత్రి మియాన్‌ జావెడ్‌ లతీఫ్‌ మంగళవారం ఒక ప్రైవేట్‌ టివి చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌లో అవసరమైన సాధారణ మెజారిటీని కూడా తమ పార్టీ సాధించలేకపోయిందని చెప్పారు. ఇక్కడా, అక్కడా సీట్లన్నీ పోగేసి వారు (సైన్యం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని మీరు పిఎంఎల్‌-ఎన్‌ ప్రభుత్వంగా పిలవచ్చు కానీ వాస్తవానికి, అది ఒక కీలుబొమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఎక్కడ అసలైన అధికారం వుందో ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నడిపినా, వారి విధానాల తాలుకూ భారాన్ని మోయాల్సింది పిఎంఎల్‌-ఎన్‌ మాత్రమేనని అన్నారు.

➡️