పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన

Feb 20,2024 14:13 #Pakistan, #political crisis

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఓటింగ్‌ జరిగి 11 రోజులు దాటినా కేంద్రంలో ఏపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తాజాగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) అగ్రనేతల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంగళవారం పిఎంఎల్‌-ఎన్‌ సీనియర్‌ నేత ఇషాక్‌ దార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు.  పిపిపి ప్రతినిధి బృందం నుండి మురాద్‌ అలీ షా, కమర్‌ జమాన్‌ కైరా, నదీమ్‌ అఫ్జల్‌ చాన్‌, ఇతర నేతలు సమావేశానికి హాజరైనట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దేశంలో హంగ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు పిఎంఎల్‌-ఎన్‌, పిపిపి సమన్వయ కమిటీల మధ్య ఇవి ఐదవ రౌండ్‌ చర్చలు కావడం గమనార్హం.   సోమవారం  మూడుగంటల కొనసాగిన చర్చలు.. తాత్కాలికంగా నిలిచిపోయాయి.  పిఎంఎల్‌-ఎన్‌, పిపిపి రెండూ తిరిగి రాత్రి పదిగంటలకు సమావేశానికి అంగీకరించాయి. అయితే సమావేశం జరగలేదు. చివరికి పిపిపితో బుధవారం చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని సోమవారం రాత్రి 11 గంటలకు పిఎంఎల్‌-ఎన్‌ ప్రకటించి సమావేశాన్ని ముగించింది.  అనంతరం పిఎంఎల్‌-ఎన్‌ నేత అజం నజీర్‌ తరార్‌ మీడియాతో మాట్లాడారు. చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, పిపిపిని కేబినెట్‌లో చేర్చే అంశంపై నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

➡️