పాక్‌ పోలింగ్‌ హింసాత్మకం

Feb 9,2024 10:46 #Pakistan

ఇద్దరు చిన్నారులతో సహా 12మంది మృతి

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ఇస్లామాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్‌లో గురువారం జరిగిన పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. సాయుధ గ్రూపులు హింసకు పాల్పడ్డాయి. దేశంలోని వేర్వేరు చోట్ల జరిగిన ఘర్షణల్లో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు భద్రతా సిబ్బందితో సహా 12 మంది మరణించారు. హింసాత్మాక ఘటనల నేపథ్యంలో కౌటింగ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. తాజా పరిణామాల దరిమిలా ఎన్నికల సంఘం మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను సైతం నిషేదించింది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని పాక్‌ ఎన్నికల కమిషన్‌ (ఇసిపి) వెల్లడించింది. రాత్రంతా ఓట్ల లెక్కింపు సాగనుంది. శుక్రవారం తెల్లవారు జామున స్పష్టత వచ్చేవీలుంది. మొబైల్‌ సర్వీసులపై నిషేధం విధించడం ఒక రకమైన రిగ్గింగేనని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సలహాదారు వ్యాఖ్యానించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కాగా పోలింగ్‌ సమయాన్ని పొడిగించాల్సిందిగా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు కోరాయి. కానీ ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. కాగా దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు వస్తాయని ప్రస్తుతమున్న ధోరణులను బట్టి తెలుస్తోంది. కాగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మాత్రం మెజారిటీ లభిస్తుందన్న విశ్వాసంతో వున్నారు. పార్లమెంట్‌ దిగువ సభ అయిన నేషనల్‌ అసెంబ్లీకి, ఖైబర్‌ ఫంఖ్తుఖ్వా, పంజాబ్‌, బలూచిస్తాన్‌, సింథ్‌ ప్రావిన్షియల్‌ అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరిగాయి. అభ్యర్ధి మృతి కారణంగా ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడడంతో నేషనల్‌ అసెంబ్లీలో 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 5 వేల మంది పైగా అభ్యర్ధులు బరిలో వున్నారు. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక గంట వ్యవధిలో ఏ పోలింగ్‌ స్టేషన్‌ అనధికార ఫలితాలను కూడా ప్రకటించకుండా మీడియాతో సహా అన్ని సంస్థలపై ఇసిపి నిషేధం విధించింది. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 12.8 కోట్ల మంది ప్రజలు ఓటు వేసేందుకు అర్హులని ఇసిపి ప్రకటించింది. కాగా నాలుగు ప్రావిన్షియల్‌ అసెంబ్లీల్లోని 590 సీట్లకు 12 వేల మందికి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. నేషనల్‌ అసెంబ్లీలో మొత్తంగా 336 మంది సభ్యులుంటారు. వీరిలో 266 మందినే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మతపరమైన మైనారిటీలకు రిజర్వ్‌ చేశారు.

➡️