పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాల్సిందే

May 12,2024 00:50 #Full membership, #Palestine

– ఐరాస జనరల్‌ అసెంబ్లీ చారిత్రాత్మక తీర్మానం
– భద్రతా మండలికి మరోమారు ప్రతిపాదన
– అనుకూలంగా 143 ఓట్లు, వ్యతిరేకంగా 9, తటస్థంగా 25
న్యూయార్క్‌ : పాస్తీనాను పూర్తి స్థాయి సభ్యత్వ దేశంగా గుర్తించే చారిత్రాత్మక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ గురవారం రాత్రి ఆమోదించింది. సభ్య దేశంగా తీసుకునేందుకు అవసరమైన అర్హత పాలస్తీనాకు వుందని, కాబట్టి పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చే విషయాన్ని పునౌ పరిశీలించాల్సిందిగా భద్రతా మండలికి జనరల్‌ అసెంబ్లీ సిఫార్సు చేసింది. ఇంతకుముందు అమెరికా భద్రతా మండలిలో ఇటువంటి తీర్మానాన్ని వీటో చేసింది. ఇప్పుడు జనరల్‌ అసెంబ్లీలో కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన తొమ్మిది దేశాల్లో అమెరికా ఒకటి. జనరల్‌ అసెంబ్లీలో తీర్మానం ఆమోదానికి మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం కాగా, దీనికి అంతకుమించిన ఓట్లు లభించాయి. అరబ్‌ గ్రూపు దేశాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 143 దేశాలు ఓటు చేయగా, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటు చేశాయి. మరో 25 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 22 అరబ్‌ దేశాల తరపున యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. వ్యతిరేకించిన దేశాల్లో అమెరికా, ఇజ్రాయిల్‌,అర్జెంటీనా, జెకియా, మైక్రోనేసియా, నవురూ, పౌలూ, పపువా న్యూగినియా వున్నాయి. . ఐక్యరాజ్య సమితి నిబంధనావళిలోని 4వ అధికరణకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి పాలస్తీనా అర్హురాలని, వెంటనే సభ్యత్వాన్ని ఆమోదించాలని తీర్మానం కోరింది. ఈ తీర్మానం ఆమోదం పొందడం పట్ల సిరియా, వెనిజులా, సౌదీ అరేబియా తదితర దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఐరాసలో పాలస్తీనాను పూర్తి సభ్యత్వ దేశంగా గుర్తించాలనేది ప్రపంచ ప్రజల డిమాండ్‌ అని వెనిజులా విదేశాంగ మంత్రి యెవాన్‌ గిల్‌ పేర్కొన్నారు. సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి అబ్దుల్‌ అజీజ్‌ అల్వాసిల్‌ కూడా ఇదే విధమైన వ్యాఖ్య చేశారు. పాలస్తీనియన్ల ఇబ్బందులను ఇక ఎన్నాళ్లో ప్రపంచం విస్మరించలేదని, వాస్తవాన్ని గట్టిగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. గాజాలో పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో గతేడాది డిసెంబరు 12న జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశానికి కొనసాగింపుగా యుఎన్‌జిఎ అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్‌ జవాబుదారీతనం వహించాల్సిన రోజు ఒకనాడు వస్తుందని పాకిస్తాన్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ పేర్కొన్నారు. ఓటింగ్‌కు ముందు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా శాశ్వత పరిశీలకుడు రియాద్‌ మన్సూర్‌ మాట్లాడుతూ, పాలస్తీనియన్లకు, వారి కుటుంబాలకు, కమ్యూనిటీలకు, మొత్తంగా దేశానికి జరిగిన నష్టం, కలిగిన బాధను చెప్పడానికి మాటలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️