మాల్దీవుల అధ్యక్షుడిని తొలగించాలి : ప్రతిపక్షాల డిమాండ్‌

 మాలె :   ప్రధాని మోడీపై మాల్దీవుల వివాదాస్పద వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం రోజురోజుకు తీవ్రమౌతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జును తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుండి తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఎంపి అలీ అజీమ్‌ డిమాండ్‌ చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) సూచించారు. విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ను ప్రశ్నించాలని మరో ఎంపి మీకైల్‌ నసీమ్‌ పార్లమెంటును కోరారు.

భారత్‌ తమ దేశానికి చాలా ముఖ్యమని ఎండిపి నేత, మాల్దీవుల రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్‌ దీదీ పేర్కొన్నారు. భారత్‌ ఆపత్కాలంలో ఆదుకునే ‘911 కాల్‌’ వంటిదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో దూరదఅష్టి లోపించిందని, అందరితో స్నేహంగా ఉండే చిన్నదేశం తమనదని గుర్తించాలని అన్నారు. అదే సమయంలో భారత్‌ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదని, రెండు దేశాలకు ఒకేరకమైన సవాళ్లున్నాయని చెప్పారు. భారత్‌ ఎల్లప్పుడూ సాయంగా నిలుస్తోందని, ఇతర రంగాలతో పాటు రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహకరిస్తోందని అన్నారు. చిరకాల స్నేహాన్ని దెబ్బతీసే ఏ వైఖరి సరికాదని ఆయన హెచ్చరించారు.

➡️