వేడెక్కుతున్న భూగోళంలో మార్పులపై స్కానింగ్‌

Feb 9,2024 10:31 #globe, #NASA, #warming

 వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా

కేప్‌ కేన్వరాల్‌ : ప్రపంచంలోని మహా సముద్రాలు, వాతావరణంపై అధ్యయనం చేసేందుకు నాసా కొత్త వాతావరణ ఉపగ్రహాన్ని గురువారం ప్రయోగించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సవివరమైన డేటా కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 948 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందించిన పేస్‌ ఉపగ్రహాన్ని ఫాల్కన్‌ రాకెట్‌ గురువారం తెల్లవారు జామున కక్ష్యలోకి తీసుకెళ్ళింది. అత్యంత అరుదైన ధృవ కక్ష్యను చేరేందుకు అట్లాంటిక్‌ మీదుగా దక్షిణ దిశగా వెళ్ళేలా ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించారు. 676 కిలోమీటర్ల ఎత్తులో వుండి మూడేళ్ళపాటు మహా సముద్రాలపై, అలాగే వాతావరణంపై ఈ ఉపగ్రహాం అధ్యయనం జరుపుతుంది. తన వద్ద గల రెండు సైన్‌్‌స సాధనాలతో మొత్తంగా గ్లోబ్‌ను రోజుకు రెండుసార్లు స్కాన్‌ చేస్తుంది. ఉపగ్రహంలో గల మూడో సాధనం నెలవారీ గణాంకాలు ఇస్తుంది. మన భూగోళం గురించి గతంలో ఎన్నడూలేని రీతిలో సమాచారం అందనుందని ప్రాజెక్ట్‌ శాస్త్రవేత్త జెరిమీ వెర్డ్‌ల్‌ తెలిపారు. హరికేన్‌లు, తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు వంటి వాటి సమాచారాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ పరిశీలనలు తోడ్పడతాయని భావిస్తున్నారు. అలాగే భూగోళం వేడెక్కుతున్న నేపథ్యంలో సంభవించే మార్పులను పరిశీలించడానికి కూడా దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రమాదకరమైన రీతిలో జల వనరుల్లో నాచు పెరిగిపోవడాన్ని మెరుగైన రీతిలో ఊహించడానికి కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఇప్పటికే కక్ష్యలో నాసాకు 25కి పైగా వాతావరణ ఉపగ్రహాలు వున్నాయి.

➡️