కాన్సులేట్‌పై దాడికి ఇరాన్‌ ప్రతీకారం

Apr 15,2024 08:08 #Iran-Israel, #UN Security Council

ఇజ్రాయిల్‌ పై డ్రోన్లు, క్షిపణులతో దాడి
వన్‌ టైమ్‌ పనిష్మెంట్‌ పూర్తయింది: ఖమేనీ
సమర్థవంతంగా తిప్పికొట్టాం: నెతన్యాహు
దెబ్బకు దెబ్బ పద్ధతి వద్దు: : నెతన్యాహకు బైడెన్‌ ఫోన్‌
ఇరాన్‌ దాడికి పశ్చిమ దేశాల ఖండన

టెల్‌అవీవ్‌: సిరియాలోని తమ దౌత్య కార్యాలయంలో ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు సైనిక అధికారులను హతమార్చిన యూదు రాజ్యం దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ డజన్ల కొద్దీ క్షిపణులు, కమికేజ్‌ డ్రోన్లతో ఆదివారం తెల్లవారు జామున దాడులు చేసింది. టెల్‌ అవీవ్‌, పశ్చిమ జెరూసలెం సహా ఇజ్రాయిల్‌ అంతటా పేలుళ్ల శబ్దాలు, వైమానిక దాడుల సైరన్లు వినిపించాయని వార్తా సంస్థలు తెలిపాయి. ఇజ్రాయిల్‌ రక్షణ బలగాల ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియర్‌ హగారియా ఈ విషయాన్ని ఆదివారం నాడిక్కడ మీడియాకు వివరించారు. ఇరాన్‌ ప్రయోగించిన 300కిపైగా క్షిపణులు, డ్రోన్లలో 99 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకోక ముందే తాము కూల్చేశామని అన్నారు. డమాస్కస్‌లోని తమ కార్యాలయంపై ఈ నెల1న ఇప్రాయిల్‌ జరిపిన వైమానిక దాడికి వన్‌ టైమ్‌ పనిష్మెంట్‌ పూర్తి చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌ మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు ఇదొక హెచ్చరిక అని ఆయన అన్నారు. ఈ దాడిపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ఎక్స్‌లో (పూర్వ ట్విట్టర్‌లో) స్పందిస్తూ ఇరాన్‌ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని అన్నారు. ఇరాన్‌ చర్యకు ప్రతీకారం పేరుతో ఇజ్రాయిల్‌ దాడి చేసిన పక్షంలో దానికి తన మద్దతు ఉండబోదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నెతన్యాహుకు స్పష్టంగా తెలియజేసినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని వైట్‌ హౌస్‌ అధికారి ఒకరు అదివారం తెలిపారు. దెబ్బకు దెబ్బ అనే రీతిలో వ్యవహరిస్తే, అది ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని, దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉండే అవకాశముందని అమెరికా ఆందోళన చెందుతున్నది. దీనికి సమ్న్వయంతో దౌత్యపరమైన గట్టి రియాక్షన్‌ ఇద్దామని బైడెన్‌ నెతన్యాహుతో అన్నట్లు వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం దీనిపై జి-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బైడెన్‌ తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపి ఇరాన్‌ చర్యను ఖండించాలని ఇజ్రాయిల్‌ డిమాండ్‌ చేసింది. సిరియాలోని ఇరాన్‌ కాన్సులేట్‌పై కార్యాలయంపై ఇజ్రాయిల్‌ దాడిని ఖండించడానికి ఇష్టపడని అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఇతర పశ్చిమ దేశాలు ఇరాన్‌ ప్రతీకార దాడిని మాత్రం వెంటనే ఖండించాయి. చైనా, రష్యా ఆచితూచి స్పందించాయి. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని చైనా కోరింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ ఇరాన్‌ దాడిని ఖండించారు. మరో యుద్ధాన్ని భరించగలిగే స్థితిలో ప్రపంచం ఇప్పుడు లేదని, ఘర్షణలకు వెంటనే స్వస్తి పలకాలని ఆయన కోరారు.
ప్రశ్నార్థకంగా మారిన భారతీయుల భద్రత?
ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఘర్షణ మరింత విస్తరించిన పక్షంలో అది ప్రాంతీయ యుద్ధానికి దారి తీసే ప్రమాదముండడంతో ఇజ్రాయిల్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ఇజ్రాయిలీ సరుకుల రవాణా నౌకను హర్ముజ్‌ జలసంధిలో స్వాధీనం చేసుకున్న ఘటనలో 17 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వారి విడుదలకు భారత విదేశాంగ శాఖ దౌత్య పరమైన మార్గాల గుండా చేస్తున్న యత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తాజా పరిణామం తరువాత పెరుగుతున్న యుద్ధ భయం నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో భారతీయుల భద్రతపై కఅనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది.

➡️