ఆకస్‌ను ఆపండి !

May 16,2024 00:25 #chinna
  • అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలను కోరిన చైనా

బీజింగ్‌ : అకస్‌ అణు జలాంతర్గామి ఒప్పందాన్ని నిలిపివేయాలని అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలను చైనా కోరింది. అంతర్జాతీయ సమాజం దీనిపై ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చేవరకు ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ కోరారు. ఇందుకోసం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) వంటి వేదికలను చైనా ఉపయోగించుకుంటుందని, ఈ ఒప్పందానికి సంబంధించిన రాజకీయ, చట్టపరమైన, సాంకేతిక అంశాలను కూలంకషంగా చర్చిస్తుందని చెప్పారు. ఇటీవల వియన్నాలో చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన అకస్‌పై అధ్యయనానికి సంబంధించిన వర్క్‌షాప్‌ గురించి వ్యాఖ్యానించమని కోరగా వెన్‌బిన్‌ పై విధంగా స్పందించారు. ఈ నెల 10న దీనిపై సెమినార్‌ జరిగింది. దాదాపు 50దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఐఎఇఎ కార్యదర్శివర్గం, చైనా, ఇతర దేశాలకు చెందిన మేథావులు, నిపుణులు హాజరయ్యారు. వందమందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అకస్‌ భద్రతపై, పర్యవేక్షణ గురించి చర్చల్లో పాల్గొన్నారని, ఇది చూస్తేనే ఈ అంశంపై అంతర్జాతీయ సమాజానికి గల ఆందోళన, దృష్టి తెలుస్తోందని వెన్‌బిన్‌ పేర్కొన్నారు. అకస్‌ అణు జలాంతర్గామి ఒప్పందం ప్రాంతీయ శాంతి, భద్రతలను కొనసాగించాలనే ప్రయత్నాలను దెబ్బతీస్తుందని వెన్‌బిన్‌ చెప్పారు. అణు జలాంతర్గాములపై సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలు త్రైపాక్షిక భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనివల్ల ఆయుధ పోటీ పెరుగుతుందని, అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని చైనా పేర్కొంటోంది. చైనా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు దీనిపై పదే పదే అనుమానాలు,ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయని, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.

➡️