పశ్చిమ దేశాల ఆటలు సాగవు పుతిన్‌

Mar 1,2024 11:00 #Vladimir Putin

మాస్కో : రష్యాను మరో ఉక్రెయిన్‌ లాగా మార్చాలని అమెరికా, దాని మిత్ర దేశాలు కుతంత్రాలు పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. మాస్కోలోని గోస్టినీ డ్వోర్‌లో ఫెడరల్‌ అసెంబ్లీలో వార్షిక ప్రసంగం చేస్తూ, పశ్చిమ దేశాల కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్‌తో పాటు అనేక ఇతర దేశాలను ధ్వంసం చేసినట్టే రష్యాను ధ్వంసం చేయాలని పశ్చిమదేశాలు చూస్తున్నాయి. అటువంటి ఆటలు ఇక్కడ సాగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అవి తమ వలసవాద అలవాట్లను మానుకోలేదు, ప్రపంచవ్యాప్తంగా జాతుల మధ్య ఘర్షణలను రేకెత్తించి తమ ప్రపంచ ఆధిపత్యానికి తిరుగులేకుండా చూసుకోవాలని చూస్తున్నాయి అని రష్యా నాయకుడు ఫెడరల్‌ అసెంబ్లీకి చెప్పారు, రష్యాను వారికి అణగిమణిగి ఉండే ప్రదేశంగా మార్చాలనుకుంటున్నారు. మన అంతర్గత వ్యవహరాల్లో ఎవరినీ జోక్యం చేసుకోవడానికి అనుమతించే ప్రశ్నే లేదు అని పుతిన్‌ ఉద్ఘాటించారు. రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇందులో ఉక్రెయిన్‌ వివాదం ఒక అంశం మాత్రమే.కొత్త బహుళ ధ్రువ ప్రపంచం ఉద్భవిస్తున్నదనే విషయాన్ని పశ్చిమ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆర్థిక పరిమితుల నుండి సైనిక శక్తిని పూర్తిగా ఉపయోగించడం వరకు అన్ని విధాలుగా రష్యాతో సహా ఎదుగుతున్న శక్తులను తొక్కేయాలని పాశ్చాత్య దేశాలు చూస్తున్నాయి. ఉక్రెయిన్‌ రష్యన్‌ పౌరులపై హింసను ప్రయోగించినందున ఆ దేశంపై చర్య తీసుకోవడం మినహా తమకు ”వేరే మార్గం లేదు” అని పుతిన్‌ పేర్కొన్నారు. అమెరికా నేతత్వంలోని సైనిక కూటమి తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా రష్యా సరిహద్దుల వైపు నాటో దళాలను విస్తరిస్తూనే ఉందని పుతిన్‌ చెప్పారు.

➡️