అమెరికా చర్యపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం

Feb 23,2024 10:54 #London

వాషింగ్టన్‌ : తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అల్జీరియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని మండలిలోని మెజార్టీ దేశాలు బలపరచగా, అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర నిరాశ, అసంతృప్తిని వ్యక్తం చేసింది. గాజాపై ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి కాల్పుల విరమణ తీర్మానాన్ని అమెరికా ఇలా అడ్డుకోవడం ఇది మూడవసారి. అగ్ర రాజ్యం తీసుకున్న ఈ వైఖరి వల్ల గాజాలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ అన్నారు.

క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతలో అమెరికా కూడా భాగం ఉందన్నారు. అమెరికా చర్యను ఫ్రాన్స్‌, నార్వే, రష్యా, కతార్‌, సౌదీ అరేబియా, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, తదితర దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. బందీల విడుదల ఒప్పందంపై, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ జరిపేందుకు చర్చలు జరుగుతున్న దశలో ఈ తీర్మానం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అమెరికా రాయబారి లిండా వ్యాఖ్యానించారు. అమెరికా అండ చూసుకునే రఫాలో అమెరికా తాజాగా పెద్దయెత్తున మారణహోమానికి పాల్పడిందని, అరబ్‌ లీగ్‌ సెక్రటరీ జనరల అహ్మద్‌ అబౌల్‌ గెయిత్‌ పేర్కొన్నారు. అమెరికా వైఖరి అంతర్జాతీయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీస్తుందని అన్నారు. కూడా అమెరికా చర్యను ఖండించాయి.ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో గాజా ఒక మృత్యు కూపంగా మారిపోయింది. అక్కడి ప్రజలకు మానవతా సాయం పూర్తిగా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఆకలి రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. పశుదాణా దొరక్క మూగ జీవాలు మృత్యుబారిన పడుతున్నాయి.

ఇజ్రాయిల్‌ నుంచి రాయబారిని వెనక్కి రప్పించిన బ్రెజిల్‌

బ్రెజిల్‌ ఇజ్రాయిల్‌లోని తన రాయబారిని వెనక్కి తీసుకుంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, అంతవరకు ఆయనను తమ దేశంలోకి ఆహ్వానించదగని వ్యక్తిగా పరిగణిస్తామని ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో బ్రెజిల్‌ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత ఆదివారం ఇథియోపియా రాజధాని అడిస్‌ అబాబాలో జరిగిన ఆఫ్రికన్‌ యూనియన్‌ సదస్సులో లూలా మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన మారణ హోమం హిట్లర్‌ ఆనాడు సాగించగా, ఈనాడు హమాస్‌పై దాడి పేరుతో ఇజ్రాయిల్‌ అదే మాదిరి దారుణానికి పాల్పడడం సిగ్గు చేటు, ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు అని అన్నారు.

➡️