బిబిసి గాజా కవరేజిని నిరసిస్తూ లండన్‌లో వేలాదిమంది ప్రదర్శన

Feb 27,2024 10:39 #Gaza, #London

లండన్‌ : సాల్ఫోర్డ్‌లోని బిబిసి ప్రధాన కార్యాలయం వెలుపల వేలాదిమంది పాలస్తీనా కార్యకర్తలు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరుతూ పెద్దయెత్తున సాగుతున్న ఆందోళనలను, గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధానికి సంబంధించిని వాస్తవాలను కవర్‌ చేయకుండా బిబిస అనుసరిస్తున్న సాచివేత ధోరణిని వారు ఖండించారు. చారిటీ క్రియేటివ్‌ కైండ్‌నెస్‌ అనే సంస్థ నిర్వహించిన ఈ నిరసనకు వందలాది మంది చిన్నారులు నేతృత్వం వహించారు. గాజా శిధిలాల్లో వున్నవి ఇవే అంటూ వారు బొమ్మలు, బట్టలు, చెప్పులు కార్యాలయం బయట విడిచిపెట్టారు. 12వేల మందికి పైగా చిన్నారులు మరణించినా సరిగా వార్తలు ఇవ్వడం లేదని, మృతుల సంఖ్య తక్కువ చేసి చెబుతున్నారని బిబిసిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనీయులకు సంఘీభావంగా వారు గాలిపటాలు ఎగురవేశారు. గాజాకు చెందిన పాలస్తీనియన్లు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ మారణకాండలో చనిపోయిన తమ కుటుంబ సభ్యుల ఫోటోలను ప్రదర్శించారు. మాంచెస్టర్‌ చిన్నారులు పాలస్తీనా చిన్నారులకు ఒక ఆశావాహ దృక్పథంతో కూడిన సందేశాన్ని పంపారని గ్రేటర్‌ మాంచెస్టర్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పాలస్తీనా అధ్యక్షుడు నోర్మా టర్నర్‌ ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. పాలస్తీనియన్ల తర్వాతి తరం వుండకూడదనే లక్ష్యంతోనే ఇజ్రాయిల్‌ ఉద్దేశ్యపూర్వకంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటోందని అన్నారు. ఈ చనిపోయిన వారే ఇజ్రాయిలీలో లేదా బ్రిటీషర్లో అయితే మానవాళిపై జరుగుతున్న అత్యంత ఆటవికమైన అకృత్యాలుగా మనం రిపోర్ట్‌్‌ చేసి వుండేవారమని మాంచెస్టర్‌ పాలస్తీనా యాక్షన్‌కి చెందిన నిక్‌ బీస్లే విమర్శించారు.

➡️